మంచు మనోజ్ హీరోగా రూపొందుతున్న వడ్డీ కాసులవాడ సినిమాపై మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రముఖ కోలీవుడ్ నటుడు రవి మోహన్ స్పెషల్ రోల్‌లో కనిపించనున్నారని వార్తలొస్తున్నాయి. సినిమాలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, ఆ పాత్రే శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్ర అని తెలుస్తోంది. టైటిల్ ను చూస్తేనే సినిమా కథ మొత్తం ఈ పాత్ర చుట్టూనే తిరుగుతుందని, రవి మోహన్ కు ఈ సినిమాలో కీలక పాత్ర దక్కిందని అర్థమవుతుంది. ఈ కథ ప్రధానంగా సామాన్యుడి ఆర్థిక కష్టాలు, అప్పులు, వడ్డీ వ్యవస్థ, జీవన పోరాటం వంటి అంశాల చుట్టూ తిరుగుతుందని తెలిసింది. ఈ సినిమాకు తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తుండగా, ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మంచు మనోజ్ కామెడీ టైమింగ్, నటనకు తగ్గట్టుగా ఈ కథను రూపొందించారని తెలిసింది.