మన తెలంగాణ/హైదరాబాద్: స్థానిక సమస్యలను కిందిస్థాయిలోనే పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా సమస్యల వినతిపత్రాలు స్వీకరించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఇక నుంచి మండల కేంద్రాల్లోనూ నిర్వహించాలని ఆదేశిస్తూ పౌరసంబంధాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.

ఈ ప్రజావాణికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, వేగవంతమైన పరిష్కారమే లక్షంగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. స్థానిక సమస్యల పరిష్కారం కోసం తహశీల్దార్, ఎంపీఓ, ఎంఏఓ, ఎంఈఓ, పీహెచ్‌సీ వైద్యాధికారి, సీడీపీఓ, సంక్షేమ అధికారులు, విద్యుత్, నీటి పారుదల, ఆర్‌డబ్లూఎస్, రోడ్లు,భవనాలు, అటవీ శాఖలతో పాటు ఇతర అన్ని ముఖ్య శాఖలకు చెందిన దాదాపు 23 రకాల మండల స్థాయి అధికారులందరూ తప్పినసరిగా ప్రజావాణిలో పాల్గొనాలని ఉత్తర్వు స్పష్టం చేసింది.