రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (సిపిఎస్‌సి)మాజీ ఛైర్మన్ తమన్‌సింగ్ సోన్వానీని ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారంలో మనీలాండరింగ్ ఆరోపణలపై శనివారం నాడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఛత్తీస్‌గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (సిజిపిఎస్‌సి) 2020 2021 మధ్యకాలంలో నిర్వహించిన పరీక్షల్లో ప్రశ్నపత్రాలు లీక్ కావడమే కాకుండా తమ బంధువులు, మేనల్లుళ్లు, రాజకీయ నాయకులు, అధికారుల కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరేలా పరీక్ష ఫలితాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆయనను విచారించిన తరువాత మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అదుపు లోకి తీసుకున్నారు. సమాధానాలు చెప్పకుండా దాటవేస్తున్నారని ఈడీ అధికారులు పేర్కొన్నారు.

రాయ్‌పూర్ లోని స్పెషల్ పిఎంఎల్‌ఎ కోర్టులో హాజరు పర్చిన తరువాత కస్టోడియల్ రిమాండ్‌కు కోర్టును అభ్యర్ధిస్తారు. 2024లోసిబిఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తరువాత మనీలాండరింగ్ దర్యాప్తు ప్రారంభమైంది. కాలేజీ పేరు చెప్పి సిఎస్‌ఆర్ విరాళాల కింద దాదాపు రూ 45 లక్షల వరకు లంచాలు వసూలు చేశారని ఈడీ ఆరోపించింది.