
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించి నెల రోజులు గడుస్తున్నా.. ఆశించిన స్థాయిలో వర్షాలు ఎందుకు కురవడం లేదు.? ఆకాశంలో దట్టమైన నల్లటి మేఘాలు కమ్ముకుంటున్నా.. వాతావరణ శాఖ రోజువారీగా హెచ్చరికలు జారీ చేస్తున్నా.. తీరా చూ స్తే తగిన వానలు పడటం లేదు. జూన్ నెల ముగిసే సమయానికి రాష్ట్రంలో --------మైనస్ 26శాతం వర్షపాత లోటు నమోదైనట్లు తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక సంఘం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో దా దాపు 16 జిల్లాలు వర్షపాత లోటును ఎదుర్కొంటున్నా యి. వాతావరణ శాఖ భారీ వర్షాలు అని ముందస్తు అంచనాలు వేస్తున్నా, క్షేత్రస్థాయిలో వర్షాలు పడకపోవడానికి గల ప్రధాన సాంకేతిక కారణాలను వాతావరణ నిపుణులు విశ్లేషణ ప్రకారం.. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు తెలంగాణ వైపు రాకుండా.. చివరి నిమిషంలో ఒడిశా, ఛత్తీస్‌ఘఢ్ లేదా మధ్యప్రదేశ్ వైపునకు తప్పుకుంటున్నాయి. ఆకాశంలో నల్లటి మబ్బులు కనిపిస్తున్నప్పటికీ రుతుపవన గాలుల్లో వేగం మందగించడం వల్ల ఆ మేఘాలలో వర్షంగా మారడానికి కావాల్సిన తేమ శాతం చాలా తక్కువగా ఉంటోంది. ప్రస్తుతం పడుతున్న వర్షాలు కేవలం స్థానిక ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల వల్లే కురుస్తున్నాయి. దీనివల్ల నగరంలోని ఒక ఏరియాలో రోడ్లు మునిగేలా వాన పడితే, పక్క ఏరియాలోనే పొడి వాతావరణం ఉంటోంది. దీనిని రాష్ట్రవ్యాప్త వర్షంగా పరిగణించలేమంటున్నారు నిపుణులు.
జిల్లాల వారీగా పరిస్థితి.. రైతుల అవస్థలు
జూన్‌లో రాష్ట్రవ్యాప్తంగా సాధారణ వర్షపాతం 13.40 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా, కేవలం 96.9 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అత్యధికంగా హనుమకొండ జిల్లాలో ఏకంగా 71 శాతం వర్షపాత లోటు ఉంది. హైదరాబాద్‌లో కూడా సాధారణం కంటే 4 శాతం తక్కువ వర్షం పడింది. అయితే రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మాత్రం సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురవడం గమనార్హం. గతేడాది ఇదే సమయానికి దాదాపు 30 లక్షల ఎకరాల్లో రాష్ట్రవ్యాప్తంగా పంటలు సాగయ్యాయి. ఈ వానాకాలంలో 62.47 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్షంగా ఉండగా.. ఇప్పటి వరకు వేల ఎకరాల్లో మాత్రమే వరినాట్లు పడటం వర్షభావ పరిస్థితులకు అద్దం పడుతోంది. ఈసారి 50.13 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని
అంచనా వేయగా.. ఇప్పటికే రైతులు లక్షలాది ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటారు. వర్షాలు లేకపోవడంతో వేసిన విత్తనాలు మొలకెత్తడం లేదు. తొలకరి వానలు కురుస్తాయని పత్తి విత్తనాలు విత్తుకున్న వారి ఆశలు అడియాశలయ్యాయి. జూన్ మొదటి వారంలో విత్తుకున్న విత్తనాలు మొలకెత్తకుండానే పాడైపోయాయి. మరోసారి విత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులపై అదనపు పెట్టుబడి భారం పడుతోంది. కనీసం 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతేనే పత్తి విత్తనాలు వేసుకోవాలని వ్యవసాయ శాఖ స్పష్టం చేస్తోంది. నాలుగైదు రోజుల్లో వర్షాలు కురిస్తేనే పంటలు దక్కుతాయని, లేకపోతే కరువు కమ్ముకోవడం ఖాయమని రైతులు వాపోతున్నారు.
రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోంది?
భారత వాతావరణ శాఖ తాజా బులిటెన్ ప్రకారం.. రాబోయే 3-4 రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు ఐఎండి అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జూలై రెండో వారం నాటికి బంగాళాఖాతంలో బలమైన వ్యవస్థ ఏర్పడితేనే రాష్ట్రవ్యాప్తంగా సరైన వానలు కురుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.












