
పార్లమెంట్‌లో అమిత్ షా ప్రకటన చేస్తారన్న ప్రభుత్వ హామీపై విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రధానంగా మేం మూడు అంశాలపై చర్చ జరగాలని పట్టుబడుతున్నట్లు చెప్పారు. సభలో అమిత్ షా సాధారణ అంశాలపై చేయబోయే ప్రసంగంపై తమకు ఆసక్తిలేదని, ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పెల్లెట్‌గన్స్ ప్రయోగానికి ఎవరు ఆదేశించారన్నదానిపై ఆయన స్పష్టమైన ప్రకటన చేసేందుకు రావాలని సూచించారు. పార్లమెంట్ సమావేశాలు మొదలై 15 రోజులు గడుస్తున్నా సభా నాయకుడు, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు సభకు వచ్చే ధైర్యం లేదని దుయ్యబట్టారు. సోమవారం ఇక్కడి ఇందిరా భవన్‌లో ఎఐసిసి చీప్ ఖర్గేతో కలిసి రాహుల్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థులపై కాల్పులకు హోంమంత్రిగా అదేశించింది అమిత్ లేక వేరే వ్యక్తా? అనే ఒక్క ప్రశ్నకే తాము సమాధానానికి పట్టుబడుతున్నామని అన్నారు.
ఒకవేళ ఆదేశాలిచ్చింది అమిత్ షానే అయితే ఇందులో దోషి ఆయనేనన్నారు. ఒకవేళ ఆయన కాకుండా మరో వ్యక్తి అయ్యుంటే ఈయన అధికారాన్ని సమర్థవంతంగా నిర్వహించలేని అసమర్థుడు అవుతారని వ్యాఖ్యానించారు. జంతర్‌మంతర్‌లో నిరసనకారులపై దమనకాండకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ రాహుల్ డిమాండ్ చేశారు. ఇక తమ మూడో డిమాండ్ అయోధ్యలో రామాలయం నిధుల అవకతవకలపై చర్చ జరగాలని కోరుతున్నామన్నారు. అయోధ్య ఆలయం నిధులను ప్రధానికి సన్నిహితుడిగా ఉన్న వ్యక్తే దోచుకున్నారని ఆరోపించారు. ఖర్గే మాట్లాడుతూ.. ఒక విపక్షంగా పేపర్ లీక్ అంశంతో పాటు అయోధ్యలో దోపిడీపై ప్రశ్నించడం తప్పెలా అవుతుందన్నారు. 15 రోజులుగా ప్రభుత్వం తప్పించుకు తిరుగుతుందని ఖర్గే మండిపడ్డారు.











