
బెంగళూరు: టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వహించాలని మూడేళ్ల క్రితమే తనను భారత క్రికెట్ బోర్డు కోరిందని, అయితే ఆ ఆఫర్‌ను తాను స్వచ్ఛందంగా తిరస్కరించానని భారత మాజీ క్రికెటర్, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ చీఫ్ వివిఎస్ లక్ష్మణ్ స్పష్టం చేశాడు. ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో లక్ష్మణ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్ పదవి నుంచి వైదొలిగిన తర్వాత ఆ బాధ్యత చేపట్టాలని బిసిసిఐ తనను కోరిందన్నాడు. అప్పటి బిసిసిఐ కార్యదర్శి జైషా విజ్ఞప్తిని తాను తోసిపుచ్చానని గుర్తు చేశాడు.
వ్యక్తిగత కారణాలతో తాను ప్రధాన కోచ్ పదవి బాధ్యతలను చేపట్టలేనని జైషాతో పాటు బిసిసిఐ పెద్దలకు స్పష్టం చేశానని వివరించాడు. తన విజ్ఞప్తిని మన్నించిన బిసిసిఐ సిఓఇ చీఫ్ పదవిని మరి కొన్నేళ్ల పాటు పొడిగిందన్నాడు. అప్పటి బిసిసిఐ కార్యదర్శి తనకు పూర్తి సహకారం అందించారన్నాడు. ప్రస్తుతం ఉన్న దేవజిత్ సైకియా సైతం తనకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తున్నారని పేర్కొన్నాడు. ప్రస్తుతానికైతే తనకు భారత జట్టు ప్రధాన కోచ్ పదవి చేపట్టాలని లేదని లక్ష్మణ్ తేల్చి చెప్పాడు.











