
మన తెలంగాణ/హైదరాబాద్: రుణాలు ఇప్పిస్తామంటూ తెలంగాణ ప్రజలను టార్గెట్ చేసి సైబర్ మోసాలకు పాల్పడుతూ, ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న కాల్‌సెంటర్ నెట్‌వర్క్‌ను రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టిజిసిఎస్‌బి) చేధించింది. దీనికి సంబంధించిన వివరాలను సోమవారం టిజిసిఎస్‌బి డైరెక్టర్ శిఖాగోయెల్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఢిల్లీలోని శివ మార్కెట్‌లో నిర్వహిస్తున్న మూడు మోసపూరిత కాల్‌సెంటర్లపై సమన్వయంతో దాడులు నిర్వహించి 21 మంది మహిళా టెలీకాలర్లు, ఒక బ్యాంకు ఖాతాదారుడిని అదుపులోకి తీసుకున్నారు. కాల్‌సెంటర్లను నిర్వహిస్తున్న ముగ్గురు ప్రధాన నిర్వాహకులను గుర్తించినప్పటికీ వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
ఈ నెట్‌వర్క్ సుమారు ఒకటిన్నర సంవత్సరాలుగా కొనసాగుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. మోసగాళ్లు 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న, తెలుగు లో అనర్గళంగా మాట్లాడగల మహిళలను టెలీకాలర్లుగా నియమించుకున్నారు. తెలంగాణ ప్రజల నమ్మకాన్ని సులభంగా పొందేందుకు వారిని ఉపయోగించినట్లు టిజిసిఎస్‌బి తెలిపింది. బజాజ్ ఫైనాన్స్ ప్రతినిధులమని చెప్పుకుంటూ, ఆకర్షణీయమైన రుణ మంజూరు ఆఫర్లతో బాధితులను వలలో వేసేవారు. అరెస్టయిన టెలీకాలర్లలో పలువురు జగిత్యాల జిల్లా కోరుట్ల, హైదరాబాద్‌లోని సైదాబాద్, బోరబండ, మహబూబ్‌నగర్ ప్రాంతాలకు చెందినవారిగా విచారణలో తేలింది.
ఛార్జీల పేరుతో దోపిడీ
ముందుగా సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్ ప్రకారం బాధితులతో ఫోన్‌లో మాట్లాడేవారు. రుణం ఇప్పించేందుకు ప్రాసెసింగ్ ఫీజు, వెరిఫికేషన్ ఛార్జీలు, డాక్యుమెంటేషన్ ఫీజు, బీమాప్రీమియం తదితర పేర్లతో డబ్బులు వసూలు చేసేవారు. బాధితులు డబ్బులు చెల్లించిన తర్వాత ఫోన్ సంభాషణ నిలిపివేయడం లేదా రుణం మంజూరు చేస్తామంటూ మరింత డబ్బు డిమాండ్ చేయడం చేసేవారు.
మోసం బయటపడిన తర్వాత బాధితులు ప్రశ్నిస్తే నిందితులు బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అడ్డుకునేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, పరువుకు భంగం కలిగిస్తామని, వ్యక్తిగత సమాచారం, గుర్తింపు పత్రాలను దుర్వినియోగం చేస్తామని హెచ్చరించినట్లు విచారణలో వెల్లడైంది. ఆపరేషన్‌లో టిజిసిఎస్‌బి అధికారులు 23 మొబైల్ ఫోన్లు, రెండు బ్యాంకు పాస్‌బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ కాల్ సెంటర్ నెట్‌వర్క్‌కు తెలంగాణ వ్యాప్తంగా నమోదైన 22 సైబర్ నేర కేసులతో సంబంధాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ నెట్‌వర్క్ మూడు వేర్వేరు బృందాలుగా పనిచేసినట్లు అధికారులు గుర్తించారు. బృందాలకు చెందిన ప్రధాన నిర్వాహకులు లలిత్ సింగ్, కుల్దీప్ సింగ్, అనిల్‌లు పరారీలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
తెలుగులో మాట్లాడుతున్నారని నమ్మొద్దు
రుణాలు ఇప్పిస్తామంటూ వచ్చే ఫోన్ కాల్స్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టిజిసిఎస్‌బి సూచించింది. ప్రాసెసింగ్ ఫీజు, వెరిఫికేషన్ ఛార్జీలు లేదా ఇతర ఏ మొత్తమైనా చెల్లించే ముందు కాల్ చేసిన వ్యక్తి, రుణ సంస్థ నిజమైనవేనా అనే విషయాన్ని స్వతంత్రంగా ధ్రువీకరించుకోవాలని తెలిపింది. కాల్ చేసిన వ్యక్తి మహిళ కావడం, తెలుగులో లేదా ఇతర ప్రాంతీయ భాషల్లో మాట్లాడటం మాత్రమే నమ్మకానికి ప్రాతిపదికగా తీసుకోవద్దని హెచ్చరించింది. బాధితుల విశ్వాసాన్ని పొందేందుకు సైబర్ నేరగాళ్లు ప్రాంతీయ భాషలు మాట్లాడే వారిని ఎక్కువగా నియమించుకుంటున్నారని పేర్కొంది. దీంతో పాటు కుటుంబ సభ్యులు ఇతర రాష్ట్రాల్లో, ముఖ్యంగా కాల్‌సెంటర్లలో ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వారు ఎలాంటి పని చేస్తున్నారనే దానిపై కుటుంబాలు అవగాహన కలిగి ఉండాలని టిజిసిఎస్‌బి సూచించింది. మోసపూరిత సైబర్ కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తేలితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ ఆపరేషన్‌లో అధికారులు డిప్యూటి ఎస్‌పిజి. శ్రీనివాసు, ఇన్‌స్పెక్టర్లు భద్రరాజు రమేష్, డి. శ్రీను, సబ్ ఇన్‌స్పెక్టర్లు మహేందర్, కార్తీక్, శిరీష, లిఖిత తదితరులు పాల్గొన్నారు.











