
ఇపుడిపుడే అనిపిస్తుంది నాదనుకునే
ఈ చోటు ఒక అనుభూతి మాత్రమేనని
ఎపుడెపుడో జరిగినవి గుర్తొస్తున్నాయి
కాలానికి గాలం వేసి ఎంత లాగినా
శూన్య హస్తం గుండెను తడుముతోంది
అప్పటికప్పుడు నిశ్శబ్దం వాకిట
మనసు, గంటలతరబడి వేలాడుతుంది
శబ్దాలను ఎవ్వరికీ వినబడని
చిరు సవ్వడి చేస్తూ, ఎప్పటికప్పుడు
నన్ను నేను దర్శించుకుంటాను
అసూయ తరగ తన్నుకొస్తుంది
చిలికే హోరులో ముసుగేసి మరీ
ఆలోచనలను నిద్రబుచ్చుతాను
నిన్నటికి నిన్న వెన్ననుకున్న తోడు మాయమై
చిన్న వెలుగులోనూ వెంటగా వస్తూ నా నీడ
నన్ను సముదాయించ యత్నిస్తుంటుంది
ఎన్ననుకున్నా ఇప్పుడేం లాభం?
ఉండీ లేని కన్ను చూపిన దారి కొస మలుపున
నేనూ మరో మైలురాయిగా మిగలడం తప్ప!
- గుడ్లదొన సాయి చంద్రశేఖర్











