మన తెలంగాణ/హైదరాబాద్: మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో అంతర్జాతీయ ముఠాలు కొత్త పద్ధతులను అవలంభిస్తున్నాయి. ఒకప్పుడు రహ స్య సమావేశాలు, మధ్యవర్తుల ద్వారా జరిగే డ్రగ్స్ వ్యాపారం ఇప్పుడు డిజిటల్ వేదికలకు మారింది. ఇటీవల కాలంలో ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈగల్) ఆపరేషన్లలో విస్తుపోయే అంశాలు బయటపడ్డాయి. మాదకద్రవ్యా ల రవాణా, వాటి ద్వారా అర్జించిన సొమ్మును త రలించేందుకు స్మగ్లర్లు ఎంచుకున్న మార్గాలు అధికారులనే ఆశ్చర్యపోయేలా చేశాయి. డార్క్ వెబ్, ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌లు, సోషల్ మీడియా గ్రూపులు, క్రిప్టో కరెన్సీ లావాదేవీల సహాయంతో మత్తు పదార్థాలను నేరుగా వినియోగదారుల ఇం టి వద్దకే చేరవేస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇటీవలి కాలంలో జరిగిన డ్రగ్స్ స్వాధీనం కేసుల విచారణలో ఈ కొత్త తరహా నెట్‌వర్క్ వెలుగులోకి వచ్చింది. విదేశాల నుంచి చిన్న చిన్న పార్సిళ్ల రూపంలో మత్తు పదార్థాలను పంపించి, కొరియర్ సేవలు లేదా డెలివరీ ఏజెంట్ల ద్వారా వినియోగదారులకు చేరవేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణ వస్తువుల మాదిరిగా ప్యాకింగ్ చేయడం వల్ల వీటిని గుర్తించడం కష్టం గా మారుతోంది.

ఇంటర్నెట్‌లో సాధారణ సెర్చ్ ఇంజిన్‌లకు అందని డార్క్ వెబ్‌ను డ్రగ్స్ ముఠాలు ప్రధాన వేదికగా ఉపయోగిస్తున్నాయి. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ల సహాయంతో మాత్రమే యాక్సెస్ చేయగల ఈ వేదికలో మాదకద్రవ్యాల కొనుగోలు, అ మ్మకాలు జరుగుతున్నాయి. కొనుగోలుదారులు నకిలీ పేర్లతో ఖాతాలు తెరిచి ఆర్డర్లు ఇస్తుండగా, చెల్లింపులు క్రిప్టో కరెన్సీల రూపంలో జరుగుతున్నాయి. దీంతో లావాదేవీల జాడను గుర్తించడం దర్యాప్తు సంస్థలకు సవాలుగా మారుతోంది. టెలిగ్రామ్, సిగ్నల్ వంటి ఎన్‌క్రిప్టెడ్ చాట్ ప్లాట్‌ఫార్మ్‌లలో రహస్య గ్రూపులు ఏర్పాటు చేసి యువతను లక్ష్యంగా చేసుకుని ముఠాలు ప్రచారం చేస్తున్నా యి. గతంలో మాదాపూర్‌లో పోలీసుల దాడుల్లో సామాజిక మాధ్యమాల ద్వారానే స్మగ్లర్ వినియోగదారులకు సందేశాలు పంపించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో పాటు కోడ్ పదాలు వినియోగించడం, ప్రత్యేక గుర్తుల ద్వారా మత్తు పదార్థాల విక్రయాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కొందరు విక్రేతలు సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకుని, తర్వాత వ్యక్తిగత చాట్‌లలో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.

కొరియర్ ద్వారానే రవాణా

డ్రగ్స్ రవాణాకు కొరియర్ వ్యవస్థను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. చాక్లెట్లు, ఆరోగ్య ఉత్పత్తులు, గిఫ్ట్ వస్తువులు, పుస్తకాలు లేదా ఎలక్ట్రానిక్ పరికరాల ప్యాకెట్లలో మత్తు పదార్థాలను దాచిపెట్టి పంపిస్తున్నారు. నకిలీ చిరునామాలు, నకిలీ గుర్తింపు పత్రాలను ఉపయోగించడం వల్ల అసలు నిందితులను గుర్తించడం కష్టమవుతోంది. దీంతో పాటు డెలివరీ బాయ్స్‌ను సైతం మాదక ద్రవ్యాల రవాణాకు వినియోగిస్తున్నట్లు అధికారుల గుర్తించారు. ఈగిల్ దాడుల్లో అనేక మందిని డెలివరీ బాయ్స్‌ను సైతం అరెస్ట్ చేశారు. కళాశాల విద్యార్థులు, ఉద్యోగాల్లో కొత్తగా చేరిన యువతను లక్ష్యంగా చేసుకుని ఈ డ్రగ్స్ ముఠాలు పనిచేస్తున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. స్ట్రెస్ తగ్గుతుంది, ఎనర్జీ పెరుగుతుంది, ఫ్యాషన్ ట్రెండ్ వంటి తప్పుడు ప్రచారాలతో యువతను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఒకసారి అలవాటు పడితే ఆర్థికంగా, మానసికంగా తీవ్ర నష్టాలు ఎదురవుతాయని వైద్యులు చెబుతున్నారు.

అప్రమత్తంగా ఉండాలి: పోలీసులు

డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, కస్టమ్స్ అధికారులు సమన్వయంతో చర్యలు చేపడుతున్నారు. అనుమానాస్పద పార్సిళ్లు, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఆఫర్లు, సోషల్ మీడియాలో కనిపించే అనుమానాస్పద గ్రూపులపై వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలపై నిఘా ఉంచాలని, విద్యాసంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచిస్తున్నారు.