ట్రైనీ ఐపిఎస్ వేధింపులపై ప్రాథమిక ఆధారాలు లభ్యం

ఇన్‌స్టాగ్రామ్‌లో బాధితురాలు పరిచయం

ప్రేమకు దారితీసిన స్నేహం

ఎన్‌పీఏ శిక్షణలో ఇద్దరి మధ్య బలపడిన సంబంధం

ఆ తర్వాత మనస్పర్ధలు బెదిరింపులకు దిగిన ఉదయ్‌కృష్ణారెడ్డి

కేసు వివరాలు వెల్లడించిన కమిషనర్ సజ్జనార్

14 రోజుల రిమాండుకు ఉదయ్

మన తెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపిన సహచర మహిళా ట్రైనీ ఐపిఎస్ అధికారిణి వేధింపుల కేసులో నిందితుడు ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి రాజేంద్రనగర్‌లోని ఉప్పరపల్లి కోర్టు బుధవారం 14 రోజుల రిమాండ్ విధించింది. వచ్చే ఆగస్టు 11 వరకు ఆయనకు రిమాండ్ ఖరారు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. కేసు నేపథ్యాన్ని హైదరాబాద్ నగర కమిషనర్ వి.సి సజ్జనార్ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఉదయ్‌కృష్ణారెడ్డి గతంలో కానిస్టేబుల్‌గా పని చేశాడని, యూపిఎస్‌సి రాసి 2025 బ్యాచ్‌లో ఐపిఎస్‌గా ఎంపికయ్యాడని, ఉదయ్‌కృష్ణారెడ్డి 2025 డిసెంబర్ నుంచి ఎన్‌పీఏ శిక్షణలో ఉన్నాడని చెప్పారు.

గతేడాది మధ్యలో ఉదయ్‌కు ఇన్‌స్టాలో మహిళా ట్రైనీ అధికారి పరిచయమయ్యిందని, తన విజయ ప్రస్థానంపై నిందితుడి పోస్టుకు బాధితురాలు స్పందించారని అన్నారు. తాను కూడా 2024 బ్యాచ్ ఐపిఎస్‌కు ఎంపికయ్యానని, ప్రస్తుతం ఎక్స్‌ట్రా ఆర్డినరీ లీవ్ తీసుకున్నానని బాధితురాలు చెప్పారని, లీవ్ తర్వాత 2025 బ్యాచ్‌తో శిక్షణలో చేరనున్నట్లు చెప్పారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇద్దరూ స్నేహితులయ్యారని, తర్వాత ఈ పరిచయం ప్రేమకు దారితీసిందన్నారు. ఎన్‌పిఏలో శిక్షణలో ఇద్దరి సంబంధం బలపడిందని స్పష్టం తెలియజేశారు. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని, ఉదయ్‌కృష్ణా రెడ్డి పలుమార్లు ఆత్మహత్య చేసుకుంటానని, ఆయుధాలు చూపించి బాధితురాలిని బెదిరించాడని తెలిపారు.

బాధితురాలి ల్యాప్‌టాప్ విసిరి ధ్వంసం చేశాడని, ఆమె బెదిరింపులకు గురి చేసి నకిలీ సామాజిక మాధ్యమఖాతాలు సృష్టించాడని కమిషనర్ వెల్లడించారు. ట్రైనీ ఐపిఎస్ నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయని సజ్జనర్ తెలిపారు. మంగళవారం రాత్రి ఆరాంఘర్ వద్ద అధికారుల నుంచి తప్పించుకునే యత్నం చేస్తుండగా ఉదయ్ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితుడిని ఉప్పరపల్లి కోర్టు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారని తెలిపారు. మహిళా భద్రతా విభాగం డిసిపి లావణ్య నేతృత్వంలో కేసు దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు.