మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 22 ఏతో ప్రజల ఆస్తులను దోచుకుంటున్నదని కేంద్ర బొ గ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. భూభారతి-22ఏ నిషేధిత జాబితాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, ముఖ్యంగా రైతులు, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు దుయ్యబట్టారు. 22ఏకు వ్యతిరేకంగా రాంచందర్ రావు అధ్యక్షతున శనివారం పార్టీ రాష్ట్ర శాఖ ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన దీక్ష విజయవంతమైంది. పార్టీ ఎంపీలు, ఎ మ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర శాఖ పదాదికారు లు ఇంకా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతులు, కార్యకర్తలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ భూభారతి పేరిట ప్రభుత్వం

ప్రజలను వేధిస్తున్నదని విమర్శించారు. నిషేధిత జాబితాతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద అవినీతికి తెరలేపిందని ఆ యన విమర్శించారు. గతంలో బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ధరణి పేరిట దోపిడీ చేస్తే ఇప్పుడు భూభారతి పేరిట దోపిడి జరుగుతున్నదని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం తరహాలో భూదోపిడికి పాల్పడుతున్నదని ఆయన తూర్పారపట్టారు. రాష్ట్రంలో భూముల అమ్మకపోతే ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదన్నారు. అమ్మడానికి ఏ భూములు ఉన్నాయి దోచుకోవడానికి ఏ భూములు ఉన్నాయని ఆలోచన చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.


న్యాయ విచారణ: బిజెపి చీఫ్ డిమాండ్

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ప్రసంగిస్తూ తెలంగాణలో భూభారతి-22ఏ నిషేధిత జాబితాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, ముఖ్యంగా రైతులు, మధ్య తరగతి కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నట్లు చెప్పారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో ఒక బ్లాక్‌లిస్టెడ్ సాఫ్ట్‌వేర్ కంపెనీకి బాధ్యతలు అప్పగించడం వల్ల అప్పట్లోనే అనేక మంది రైతుల భూములు నిషేధిత జాబితాల్లోకి వెళ్లాయని ఆయన గుర్తు చేశారు. అప్పట్లో ధరణిలో తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించుకోవడానికి ప్రజలు అధికారుల చుట్టూ తిరిగినా స్పందన లేకపోయిందన్నారు. ధరణిలో ఉన్న లోపాలను తొలగించి భూ సంస్కరణలు తీసుకువస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని రాంచందర్ రావు విమర్శించారు.