అమరావతి: నిత్యం కులమతాలను అడ్డం పెట్టుకుని విధ్వేషాలు రగిలించడమే గొడ్డలి పార్టీ పనిగా పెట్టుకుందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు  ఆరోపించారు. గొడ్డలి పార్టీ విష వృక్షమనే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. టిడిపి ముఖ్యనేతలతో సిఎం టెలికాన్ఫరెన్స్ జరిపారు. వైసిపి నేతలతో వేదికలు పంచుకోవడంపై పరోక్షంగా ప్రస్తావించారు. వైసిపి నేతలతో ఎట్టి పరిస్థితుల్లో వేదికలు పంచుకోవాల్సి వద్దని ఆదేశించారు. గొడ్డలి పార్టీ ట్రాప్ లో నేతలెవరూ పడొద్దు అని సూచించారు. రెండేళ్ల పాలనపై చేపట్టాల్సిన ఇంటింటి ప్రచారం..ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రెండెళ్ల కూటమి పాలనపై రేపటి నుంచి 45 రోజులు పాటు..టిడిపి టు డోర్ కార్యక్రమం చేపట్టనుందని, ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని, ప్రజలకు అనుమానాలుంటే నివృత్తి చేయాలని అన్నారు. మంత్రులు, ఎంపిలు పార్టీ యంత్రాంగం మొత్తం అవుట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొనాలని, స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలవాలని చెప్పారు. కూటమి పార్టీల అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కష్టంతో కాకుండా ఇష్టంతో పనిచేయాలని ప్రజలు, కార్యకర్తలతో సన్నిహితంగా ఉండాలని కోరారు. తనకు కావాల్సింది అనుచరులు కాదు.. పార్టీకి నాయకులు అని చంద్రబాబు పేర్కొన్నారు.

గొడ్డలి పార్టీ విధ్వంసకర విధానాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని.. యువతను గొడ్డలిపార్టీ ఏవిధంగా మోసం చేసిందో వివరించాలని అన్నారు. డబ్బులతో ఎలాగైనా గెలుస్తామనే ధీమాతో గొడ్డలి పార్టీ ఉందని, కేవలం డబ్బుతోనే ప్రజాభిమానాన్ని పొందలేమని చెప్పారు. ఘోర ఓటమి చెందినా..ఇప్పటికీ సమాజంలో వైసిపి చిచ్చు రాజేస్తోందని, గొడ్డలి పార్టీ విధానాలు, తప్పుడు పద్ధతులను ప్రజల్లో ఎండగట్టాలని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.