వాషింగ్టన్: ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు కొనసాగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. ఇప్పట్లో ఆ దేశాన్ని వదలేది లేదని అన్నారు. ఇక నుంచి హర్మూజ్ జలసంధిలో ఒక నౌకపై టెహ్రాన్ దాడి చేస్తే ఆ దేశంలోని ఒక వంతెన లేదా విద్యుత్ కేంద్రంపై బాంబులతో విరుచుకుపడతామని ఆయన హెచ్చరించారు. హర్మూజ్ జలసంధిలోని నౌకపై క్షిపణి, రాకెట్, డ్రోన్, ఇతర ఏ రకమైన పరికరాలు, ఆయుధాలతో ఇరాన్ దాడి చేసినా అందుకు మూల్యం తప్పదన్నారు. తాము సైతం ఒక వంతెన లేదా విద్యుత్ కేంద్రంపై బాంబులతో ప్రతిదాడి చేస్తామని, టెహ్రాన్, దాని సమీపంలో కూడా దాడులు చేసే అవకాశం ఉందని అన్నారు.

ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో ఆయన పోస్ట్ చేశారు. గత నెలలో తాత్కాలిక కాల్పుల విరమణకు జరిగిన ఒప్పందం కుప్పకూలడంతో అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ దాడులు తీవ్రమయ్యాయి. హర్మూజ్ జలసంధిపై పట్టుకోసం పోరాటం మరింత తీవ్రమైంది. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ సైతం జోర్డాన్‌లోని పలు ప్రాంతాలను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తోంది. మరోవైపు, ఇరాన్ బ్రిడ్జిలు, విద్యుత్ ప్లాంట్లను టార్గెట్ చేస్తామని ట్రంప్ చేస్తున్న బెదిరింపులు అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకమని, పౌర లక్ష్యాలపై దాడులు తగదని పలువురు అంతర్జాతీయ న్యాయనిపుణులు పేర్కొంటున్నారు.