
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో గురువారం (నేడు) అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ జరుగుతుంది. చాలా కాలంగా రాజకీయ ఘర్షణలకు వేదిక అయిన బెంగాల్‌లో ఎన్నికలు ఎన్నికల సంఘానికి సవాలుగా మారాయి. ఇక్కడ రాజకీయ అదికారంతో పాతుకుపోయిన మమత బెనర్జీ సారధ్యపు టిఎంసికి , ఈ రాష్ట్రంలో వేళ్లూనుకోవాలని బలంగా యత్నిస్తున్న బిజెపికి మధ్య పోటాపోటీ నెలకొంది. ఎన్నికల దశ వచ్చేసరికి ఓటర్లు రెండు భిన్న ధృవాల మధ్య తమ ఓటును ఖరారు చేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. బెంగాల్‌లో అధికార పక్షం టిఎంసి అవినీతి, బంధుప్రీతి, ఉద్యోగాల స్కామ్‌లు, రాజకీయ హింసాకాండపై బిజెపి దృష్టి సారించింది. ఇక బిజెపికి తొత్తుగా కేంద్ర ఎన్నికల సంఘం మారిందని, వ్యక్తుల గుర్తింపు , ఉనికి, వారి పౌరసత్వాలను, చివరికి ఓటు హక్కును హరించి వేసిందని మమత బెనర్జీ విరుచుకుపడుతూ వచ్చారు. తీవ్రస్థాయిలో తమ రాజకీయ ఎదురుదాడితో ముందుకు సాగారు. జాతీయ స్థాయిలో బిజెపికి పూర్తి సవాలు విసురుతూ వస్తోన్న మమతకు టిఎంసి తిరిగి అధికారంలోకి రావడం అత్యంత కీలక సవాలు అయింది.
సర్ ప్రక్రియతో ఓటర్ల జాబితాలను కేంద్రం హైజాక్ చేసిందనే వాదనను టిఎంసి బలీయంగా ఓటర్ల వద్దకు తీసుకువెళ్లింది. రెండు దశల పోలింగ్ జరిగే బెంగాల్‌లో తొలి రౌండ్‌లో మొత్తం 294 స్థానాల అసెంబ్లీలోని 152 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఇందులో 54 వరకూ ఉత్తర బెంగాల్‌లోని ఎనిమిది జిల్లాలు, మిగిలినవి ముర్షీదాబాద్, నాడియా, బిర్బూమ్, హుగ్లీ ఇతర జిల్లాలో జరుగుతాయి. ఉత్తర బెంగాల్‌పైనే బిజెపి అత్యధిక ఆశలు పెట్టుకుంది. ఈ ప్రాంతం రాష్ట్రంలో రాజకీయ అధికారానికి ముఖద్వారంగా నిలుస్తుంది. ఇక్కడ బిజెపి ఏదైనా పట్టు సాధిస్తుందా? లేక ప్రాబల్యం పోగొట్టుకున్న ఈ ప్రాంతంలో టిఎంసి తిరిగి తన బలం చాటుకుంటుందా? అనేది చూడాల్సి ఉంది. ఈసారి ఇంతకు ముందటితో పోలిస్తే ఓటర్ల సంఖ్య సర్ జాబితా వడబోతతో తగ్గిపోయింది 3.60 కోట్ల మందికి పైగా ఓటర్లు ఏ పక్షాన్ని ఎంచుకుంటారనేది ప్రధానంగా ఈ తొలి దఫా పోలింగ్‌తో తేలనుంది. ఈసారి దాదాపుగా 1.75 కోట్ల మంది మహిళలు ఓటు హక్కు వినియోగానికి అర్హులుగా ఉన్నారు. ఎన్నికల సంఘం ఈసారి ఇంతకు ముందటితో పోలిస్తే మరింత పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లకు దిగింది. అత్యంత సున్నిత ఉద్రిక్తత ప్రాంతాలను గుర్తించారు.
ఈ క్రమంలో 8వేలకు పైగా పోలింగ్ కేంద్రాలకు రికార్డు స్థాయిలో 2450 కంపెనీల కేంద్రీయ బలగాలను పంపించారు. అధికార టిఎంసికి బెంగాల్‌లో బిజెపి సవాలు విసురుతోంది. ప్రత్యేకించి మహిళలపై పలు చోట్ల జరిగిన ఘోరమైన అత్యాచారాలపై అధికార పార్టీ ఇంతవరకూ ఎటువంటి చర్యకు దిగలేకపోయిందని, నిందితులైన అధికార పక్షం వారిని రక్షించేందుకు యత్నిస్తున్నారనే విమర్శలు వెలువడ్డాయి. 2021లో ఈ ప్రాంతంలోని 152 అసెంబ్లీ స్థానాలలో బిజెపి 59 చట్ల గెలిచింది. బిజెపి 93 స్థానాలు గెల్చుకుంది. దీనితో తొలిదశలో తన బలం పెంచుకోవాలని బిజెపి, ఇందుకు అడ్డుకట్ట వేయాలని మమత బెనర్జీ పరస్పరం విమర్శల కత్తులు దూసుకున్నాయి. ఓటర్ల తీర్పు తొలిదశలో రిజర్వ్ అవుతుంది. ఈసారి ఎన్నికలలో గతంతో పోలిస్తే ఓటర్ల సంఖ్యకు సర్ ప్రక్రియతో దాదాపుగా 91 లక్షలకు పైగా గండిపడింది. ఈ పరిణామం ఏ పార్టీకి అనుకూలం అవుతుందనేది తేలాల్సి ఉంది. తొలి దశ పోలింగ్ విస్తృత స్థాయిలో తేయాకు తోటల ప్రాంతాల పరిధిలో ఉంది. జల్పాయ్‌గురి, అఇపూరుదూర్, డార్జిలింగ్, కలింపాంగ్ పర్వతాలు, కూచ్ బెహార్ పరిధిలో ఓటింగ్ ఉంది.
సర్ ద్వారా భారీ స్థాయిలో ఓటర్లను తీసివేయడం కేంద్రం రాష్ట్రంలో అక్రమ వలసదార్లపై చేపట్టిన దిగ్బంధనం ఫలితం అని బిజెపి ప్రచారం చేసుకుంది. ఈ క్రమంలో స్థానికులైన బెంగాలీలకు న్యాయం జరుగుతుందని ఓటర్లకు తెలియచేసుకుంది. ఈ విషయం ఓటర్లు విశ్వసిస్తే బిజెపికి సర్‌తో భారీ ఓట్ల లబ్థికి అవకాశం ఉంది. ఇందుకు ప్రతిగా అధికార టిఎంసి తరచూ సర్‌తో స్థానిక బెంగాలీలు, ప్రత్యేకించి అణగారిన వర్గాలకు కేంద్రం కీడు తలపెట్టిందని ఆరోపించింది. దీనితో సర్ ఈ సారి ఎన్నికల్లో తెరవెనుక ప్రధాన అంశం కానుంది. అక్రమ వలసలు, పౌరసత్వ సవాళ్లపై సర్ ఓ రెఫరెండం అని బిజెపి ఓటర్ల వద్దకు వెళ్లింది. ఇప్పుడు ఈసారి ఎన్నికలలో ఓటరుకు మరో కీలక సమస్య ఏర్పడింది. దశాబ్తాలుగా ఓటేసిన వారిలో అత్యధికులు ఈసారి ఓటర్ల జాబితాలో తమ ఓటు ఉందో లేదో అనే సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. చివరికి తమకు తాము పరాయి అయ్యామనే ఆవేశం వ్యక్తం అవుతోంది.
బెంగాల్‌లో రెడ్ అలర్ట్ స్థానాల్లో 17 శాతం పెరుగుదల
ఇప్పుడు తొలిదశ పోలింగ్ జరిగే పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్తతలకు అవకాశం ఉన్న నియోజకవర్గాల సంఖ్య పెరిగింది. ఇంతకు ముందటితో పోలిస్తే ఈసారి ఈ రెడ్ అలర్డ్ స్థానాల సంఖ్య లో 17 శాతం మేర పెరుగుదల ఉందని ఎడిఆర్ నివేదికలో వెల్లడైంది. బెంగాల్‌లో చాలా కాలంగా నెలకొంటూ వచ్చిన రాజకీయ హింసాత్మకతకు ఇది అద్దం పడుతోంది. ఎన్నికలలో నిలిచిన వారిలో మొత్తం 23 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎన్నికల ప్రజాస్వామిక సంస్కరణల విశ్లేషణ సంస్థ ఎడిఆర్ బెంగాల్ తొలి దశ పోలింగ్ నేపథ్యంలో ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. మొత్తం 293 మంది అభ్యర్థుల రికార్డులను పరిశీలించారు. ఇందులో 208 మంది అంటే దాదాపుగా 71 శాతం వరకూ బిజెపి అభ్యర్థులకు కళంకిత చరిత్ర ఉంది. కాంగ్రెస్ 26 శాతంతో, టిఎంసి 39 శాతంతో నేరాలు ఎదుర్కొంటున్న వారు ఉన్నారని వెల్లడైంది. ఇక సిపిఐ (ఎం) అభ్యర్థులు దాదాపుగా 47 శాతం మంది వరకూ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు.
