ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం సంజీవ రెడ్డి భవన్ నుంచి జెడ్‌పి సెంటర్ వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రసంగిస్తూ కేంద్రంలో నీట్ పరీక్ష సక్రమంగా నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం కొనసాగుతున్నదని మండిపడ్డారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఢిల్లీ వీధుల్లో ఆందోళనకు దిగితే ప్రధాని నరేంద్ర మోడీ మౌనంగా ఎందుకు ఉన్నారని ఆయన ప్రశ్నించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేసేంత వరకూ తమ పోరాటం ఆగదని అన్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.