
మనతెలంగాణ/హైదరాబాద్: హైడ్రాకు అందమైన భాష్యం చెప్పి, తమ ఇష్టాలకు అనుగుణంగా వాడుకుంటూ, పెద్దల భూములను రక్షించుకుంటూ పేదల ఇళ్లు కూలగొడుతూ ఎంతో మందిని రోడ్డున పడేశారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విమర్శించారు. హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ను తీసివేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు.
తెలంగాణ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టడం కోసమే లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కాపాడినట్లు రంగనాథ్ అబద్ధాలు చెబుతున్నారన్నారు. దుర్గంచెరువు వద్ద ఉన్న నెక్టార్ గార్డెన్స్, ఫాతిమా కాలేజీ లాంటి వాటి జోలికి హైడ్రా ఎందుకు వెళ్లడం లేదని ఆయన మండిపడ్డారు. హిమాయత్ సాగర్, గండిపేట ఎఫ్‌టిఎల్‌లో ఉన్న ఇళ్ల వద్దకు హైడ్రా ఎందుకు వెళ్లడం లేదని, కోర్టును తప్పుదోవ పట్టించారని ఆయన విమర్శించారు.
రంగనాథ్ వ్యాఖ్యలను కోర్టు ధిక్కరణ కింద సుమోటోగా స్వీకరించాలని ఆయన కోరారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోవడానికి హైడ్రా కూడా ఒక కారణమని ఆయన పేర్కొన్నారు. హైడ్రాను బ్లాక్ మెయిలింగ్‌కు సాధనంగా వాడుకోవటం సబబు కాదని, మంత్రులు అబద్ధాలు మాని పరిపాలనపై దృష్టి సారించాలని ఆయన హితవు పలికారు. కెసిఆర్, బిఆర్‌ఎస్‌లను తలుచుకుంటే వారికి నిద్ర పట్టడం లేదన్నారు. పాలన చేయకుండా నిత్యం కెసిఆర్‌ను తిట్టుకుంటూ ఎన్నాళ్లు పబ్బం గడుపుతారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.











