మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏ డాది యథావిధిగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు చే పట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన నేపథ్యంలో జూనియర్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కు ఇంటర్మీడియట్ బోర్డు ప్రవేశాల షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 12 నుంచి తొలివిడత అ డ్మిషన్లు చేపట్టాలని తెలిపింది. విద్యార్థులు ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్ - ఎయిడెడ్, కో -ఆపరేటివ్, టిజి రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, మైనారిటీ, కెజిబివి, టిజి మోడల్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు ప్రారంభించాలని వెల్లడించింది.

జూన్ 1వ తేదీ నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం తరగతలు ప్రారంభించాలని బోర్డు ఆదేశించింది. జూన్ 30లోగా మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది. టెన్త్ ఇంటర్నెట్ మార్కుల మెమో ఆధారంగా ప్రిన్సిపాళ్లు ప్రవేశాలు చేపట్టాలని, అయితే విద్యార్థులు పదో తరగతి ఒరిజినల్ సర్టిఫికెట్‌లు సమర్పించిన తర్వాత అడ్మిషన్లు ఖరారు చేయాలని తెలిపింది. ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలలో ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా మూడు గ్రూపులకు కేటాయించిన రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.


ఎస్‌సిలకు 15 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని, అందులో గ్రూప్ 1కు ఒక శాతం, గ్రూప్ 2కు 9 శాతం, గ్రూప్ 3కి 5 శాతం రిజర్వేషన్లు పేర్కొంది. ఎస్‌టిలకు 10 శాతం, బిసిలకు 29 శాతం, వికలాంగులకు 5 శాతం, ఎన్‌సిసి, స్పోర్ట్ కోటాకి 5 శాతం, ఎక్స్ సర్వీస్ మెన్ కోటా 3 శాతం, ఇడబ్ల్యూఎస్‌కి 10 శాతం సీట్లు కేటాయించడంతోపాటు మహిళలకు 33.33 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు ఇంటర్ బోర్డ్ వెల్లడించింది. ఈ మేరకు ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు అడ్మిషన్ల ప్రక్రియ కోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఇంటర్ బోర్డు గుర్తింపు ఉన్న కళాశాలల్లో మాత్రమే ప్రవేశాలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు బోర్డు సూచించింది. ఇంటర్ బోర్డు గుర్తింపు ఉన్న జూనియర్ కాలేజీల వివరాలు www.acadtgbie.gov.in, www.tgbienew.cgg.gov.in వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. విద్యార్థులు, తల్లిదండ్రులు వెబ్‌సైట్‌లో కళాశాలకు గుర్తింపు ఉందా..? లేదా..? అన్న విషయాన్ని నిర్థారించుకున్న తర్వాతనే ప్రవేశాలు పొందాలని సూచించింది.


కాగా, 2026 -27 విద్యా సంవత్సరానికి ఈ నెల 8 నుంచి జూనియర్ కళాశాలల్లో తొలివిడత అడ్మిషన్లు చేపట్టాలని పేర్కొంటూ సోమవారం(మే 4) ఇంటర్ బోర్డు అడ్మిషన్ షెడ్యూల్ విడుదల చేయగా,మరుసటి మే 5న ఆ షెడ్యూల్‌ను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఇంటర్ ప్రవేశాలపై నెలకొన్న గందరగోళ పరిస్థితులు, పాఠశాల విద్యలో ఇంటర్ బోర్డు విలీనంపై సమీక్షించిని సిఎం రేవంత్‌రెడ్డి ఈ ఏడాది యథావిధిగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. విలీనంతో ముడిపడిన పలు సాంకేతిక సమస్యలను క్షుణ్నంగా అధ్యయనం చేయాల్సి ఉన్నందున ఈ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించారు. విలీన ప్రక్రియకు సంబంధించి భాగస్వాములతో విస్తృతంగా సంప్రదింపులు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై నియమించిన కమిటీ అధ్యయనం చేసి తన నివేదిక సమర్పించాలని సిఎం సూచించారు. అనంతరం శాసనసభలో చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.