
మన తెలంగాణ/ కరీంనగర్ క్రైం: ప్రశాంతంగా ఉండే కరీంనగర్ నగరం ఆదివారం ఉదయం తుపాకీ మోతలతో ఉలిక్కిపడింది. కరీంనగర్‌లోని టూ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల జ్యోతినగర్‌లోని పీఎంజే జ్యువెల్లరీ షాపును టార్గెట్ చేసిన ఐదుగురు దొంగల ముఠా తుపాకులతో దాడిచేసి బంగారు నగలను దోచుకెళ్లారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఉద్యోగులపై కాల్పులు జరిపి సంచలనం సృష్టించింది. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో, అదికూడా కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న పిఎంజె జ్యువెలరీ షోరూమ్‌లో దుండగులు జరిపిన భారీ దోపిడీ స్థానికంగా కలకలం రేపుతోంది.
దోపిడీ సమయంలో అడ్డుకోబోయిన కమల్, ముస్తాక్, రాజేష్, మధుకర్ అనే నలుగురు ఉద్యోగులపై దుండగులు కాల్పులు జరిపారు. తుపాకీ గాయాలకు గురైన బాధితులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీమ్ వేలిముద్రలు, బుల్లెట్లు, మ్యాగ్జిన్ స్వాధీనం చేసుకున్నారు. సీసీ టీవీ ఫు టేజీ ఆధారంగా నిందితుల ఫొటోలను విడుదల చేసి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
నిందితులు తెలుగు, హిందీ మాట్లాడినట్లు తెలిసి నార్త్ ఇండియా ముఠా కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఈ ఘటనతో పోలీసులు ఉమ్మడి జిల్లాలో హై అలెర్ట్ ప్రకటించి ప్రధాన రహదారులపై చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌లు సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటన గతంలో చొప్పదండి ఎస్బీఐ బ్యాంకులో జరిగిన సంచలన దోపిడీని గుర్తుకుతెస్తున్నది.
ముఖాలు చాటేయని దుండగులు!...
ఈ దోపిడీలో నిందితులు కనీసం ముఖాలకు మాస్కులు కూడా ధరించకుండా బహిరంగంగానే ఆయుధాలతో షోరూమ్‌లోకి ప్రవేశించా రు. ఉదయం 11 గంటల సమయంలో జనం రద్దీ ఉన్నా భయం లే కుండా వ్యవహరించడం వారి తెగింపునకు నిదర్శనంగా కనిపిస్తోం ది. దుండగులు కేవలం సాధారణ దొంగల్లా కాకుండా, శిక్షణ పొం దిన నేరస్థుల్లా వ్యవహరించారు. తుపాకులు చూపి సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసి నగదు, బంగారంతో పరారయ్యారు.
రంగంలోకి ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి
ఘటన తీవ్రత దృష్ట్యా మల్టీజోన్- 1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి, ఐపీఎస్ కరీంనగర్‌లో స్వయంగా పర్యటించారు. కరీంనగర్ సీపీ గౌస్ ఆలం, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఐజీపీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫోరెన్సిక్ ఆధారాలు, సీసీ టీవీ ఫుటేజీని విశ్లేషించి, దర్యాప్తు పురోగతిపై అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లిన ఐజీపీ, చికిత్స పొందుతున్న ఉద్యోగులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశిస్తూనే, నేరస్థులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని బాధితులకు భరోసా ఇచ్చారు.
నిఘా వైఫల్యమా? ఉగ్రవాద కోణమా?
నగరం నడిబొడ్డున, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఆఫీస్ దగ్గరగా ఉండగా వీవీఐపీల కదలికలు ఎక్కువగా ఉండేచోట ఇంతటి సాహసానికి నేరస్థులు ఒడిగట్టడం భద్రతా వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపుతోంది. గతంలో చొప్పదండి ఎస్బీఐ బ్యాంకులో జరిగిన రూ.40 లక్షల దోపిడీ కేసులో నిందితులు పశ్చిమబెంగాల్‌లో జరిగిన బాంబుబ్లాస్ట్‌లో మరణించగా వారి దగ్గర ఉన్న నగదు చొప్పదండి ఎస్బీఐ బ్యాంకులో దోపిడీ చేసిన నగదుగా నిర్ధారించారు, కాగా సదరు నేరస్థులకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఇప్పుడు జరిగిన పీఎంజే దోపిడీ శైలి కూడా దానికి దగ్గరగా ఉండటంతో, మళ్లీ అంతర్రాష్ట్ర ‘టెర్రర్ మాడ్యూల్స్’ జిల్లాలోకి ప్రవేశించాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్?
నిందితులు ఆయుధాలతో బైక్‌లపై నగరం నడిబొడ్డున తిరుగుతున్నా ఇంటెలిజెన్స్ పసిగట్టలేకపోవడం గమనార్హం. పోలీసులు చేస్తున్న సో దాలు, నాకాబందీ తనిఖీలు తూతూ మంత్రంగా జరుగుతున్నాయని ఈ ఘటనతో తేటతెల్లమైందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
పరారీలో నిందితులు.. పోలీసుల హైఅలర్ట్
సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులు నలుపు రంగు పల్సర్, తెలుపు రంగు అపాచీ బైక్‌లపై పారిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. జిల్లా సరిహద్దులను దిగ్బంధించిన పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నిందితులు మారణాయుధాలతో ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సీసీ టీవీ ఫుటేజీలో కనిపిస్తున్న ముఖాలను బట్టి ఎవరైనా గుర్తిస్తే వెంటనే సమాచారం కోసం డయల్ 100, 8712670744, 8712670745 నెంబర్లకు పోన్‌చేసి పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.













