
మన తెలంగాణ/హైదరాబాద్: ఏఐసిసి అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరుల అరెస్టులను నిరసిస్తూ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలన్న డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతలకు, అరెస్టులకు దారి తీసింది. బుధవారం పిసిసి చీఫ్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ, ఇతర నాయకులు, కార్యకర్తలు జిల్లా, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టి బొమ్మలను దగ్దం చేశారు. కాగా లోక్‌భవన్‌కు కొద్ది దూరంలో పోలీసులు బ్యారికేడ్లు పెట్టి ర్యాలీలో పాల్గొన్న వారిని అడ్డుకున్నారు. అయినా ముందుకు తోసుకుని వెళ్ళేందుకు ప్రయత్నించగా,
పోలీసులకు కార్యకర్తలకు మధ్య కొంత సేపు తోపులాట జరిగింది. తమను గవర్నర్‌ను కలిసేందుకు అనుమతించాల్సిందిగా మంత్రులు చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. తమకు అనుమతి లేదని పోలీసులు చెప్పి వారిని అక్కడే నిలుపుదల చేశారు. పోలీసులు అనుకున్న ప్రకారం ముందుగానే వాహనాలు సిద్ధంగా ఉంచుకుని, వారిని అ రెస్టు చేశారు. తమను అరెస్టు చేయడాన్ని పిసిసి చీఫ్ మ హేష్ కుమార్‌గౌడ్ భగ్గుమన్నారు. ఈ అరెస్టులు కూడా కేం ద్రం పెద్దల ఆదేశాలేనని ఆయన మండిపడ్డారు. మిగతా కార్యకర్తలనూ పోలీసులు వ్యాన్లలో బలవంతంగా ఎక్కించి అక్కడి నుంచి తరలించి అనంతరం వదిలి వేశారు.
భగ్గుమన్న భట్టి విక్రమార్క
హన్మకొండలో డిసిసి అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం
హుస్నాబాద్‌లో జరిగిన నిరసన ప్రదర్శనలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. నీట్ పరీక్షా పత్రం లీకేజీకి కారణమై లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను అంధకారం చేసిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రధాని మోడీ ఎందుకు కాపాడుతున్నారని ఆయన ప్రశ్నించారు.
బండి ఆఫీసుపై దాడికి యత్నం
ఇదిలాఉండగా కరీంనగర్‌లోని కేంద్ర హోం శాఖ సహా య మంత్రి బండి సంజయ్ ఆఫీసుపై దాడి జరగడంతో బిజెపి శ్రేణులూ రోడ్లపైకి వచ్చి నినాదాలు చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అనుచరులు నినాదాలు చేస్తూ కేంద్ర మంత్రి కార్యాలయంలోకి దూసుకుని వెళ్ళి దాడికి యత్నించారు. అయితే అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాడి విషయం తెలియగానే కరీంనగర్ మేయర్ కె. శ్రీనివాస్ నాయకత్వంలో కొంత మంది బిజెపి నాయకులు ర్యాలీగా పోలీసు కమిషనర్ కార్యాలయానికి చేరుకుని ఘటనపై చర్య తీసుకోవాలని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
సంగారెడ్డిలో జగ్గా రెడ్డి హల్‌చల్
ఇదిలాఉండగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంగారెడ్డిలో రెండో రోజూ (బుధవారం) ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించారు. మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు సంగారెడ్డి జాతీయ రహదారిపై కార్యకర్తలతో బైఠాయించడంతో సుమారు గంటకు పైగా ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. బుధవారం కూడా కార్యకర్తలతో సంగారెడ్డి కూడలిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
చాతగాని ప్రభుత్వం: మంత్రి తుమ్మల
ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం సంజీవ రెడ్డి భవన్ నుంచి జెడ్‌పి సెంటర్ వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రసంగిస్తూ కేంద్రంలో నీట్ పరీక్ష సక్రమంగా నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం కొనసాగుతున్నదని మండిపడ్డారు.











