రాష్ట్రంలో మెగా పోలీసు నియామకాలు

పోలీసు, ఎస్‌పిఎఫ్, ఫైర్, జైళ్ల శాఖల్లో 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల

త్వరలో ఆన్‌లైన్ దరఖాస్తుల షెడ్యూల్ 

వెల్లడించిన పోలీస్ నియామక మండలి బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. పోలీసు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పిఎఫ్), ఫైర్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్, జైళ్లు, దిద్దుబాటు సేవల శాఖల్లో మొత్తం 7,437 ఖాళీల భర్తీకి రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (టిఎస్‌ఎల్‌పిఆర్‌బి) చైర్మన్ వి.వి శ్రీనివాసరావు బుధవారం నాలుగు వేర్వేరు నియామక నోటిఫికేషన్లు విడుదల చేశారు.

రాష్ట్రంలో చట్టవ్యవస్థ బలోపేతంతో పాటు వివిధ భద్రతా విభాగాల్లో సిబ్బంది కొరతను అధిగమించేందుకు ఈ నియామక ప్రక్రియ చేపట్టినట్లు చైర్మన్ తెలిపారు. ఈ నియామకాల్లో పోలీసు శాఖకే అత్యధిక పోస్టులు కేటాయించారు. 148 సబ్ ఇన్‌స్పెక్టర్ (సివిల్),14 రిజర్వ్ ఎస్‌ఐ (ఏఆర్), 12 రిజర్వ్ ఎస్‌ఐ (టిజిఎస్‌పి), మూడు రిజర్వ్ ఎస్‌ఐ (ఎస్‌ఏఆర్‌సిపిఎల్),27 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎఫ్‌పిబి) పోస్టులు ఉన్నాయి. అలాగే 3,697 కానిస్టేబుల్ (సివిల్), 1,052 కానిస్టేబుల్ (ఏఆర్),24 కానిస్టేబుల్ (ఎస్‌ఏఆర్‌సిపిఎల్),20 డ్రైవర్, ఏడు మెకానిక్ పోస్టులు భర్తీ చేయనున్నారు.

రాష్ట్రంలోని కీలక ప్రభుత్వ సంస్థలు, భవనాలు, ప్రజాప్రతినిధులకు భద్రత కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 44 సబ్ ఇన్‌స్పెక్టర్, 1,380 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 1,424 ఉద్యోగాలు ఈ విభాగంలో అందుబాటులో ఉన్నాయి. అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సేవలను మరింత పటిష్టం చేసేందుకు ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ శాఖలో 39 స్టేషన్ ఫైర్ ఆఫీసర్, 751 ఫైర్ ఫైటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ విభాగంలో 14 డిప్యూటీ జైలర్ (పురుషులు), ఒక డిప్యూటీ జైలర్ (మహిళలు), 196 వార్డర్ (పురుషులు), 12 వార్డర్ (మహిళలు)పోస్టులు ఉన్నాయి.

త్వరలో దరఖాస్తుల స్వీకరణ

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ తేదీలు, పరీక్షల షెడ్యూల్‌ను త్వరలో ప్రత్యేక ప్రకటన ద్వారా వెల్లడిస్తామని బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండే దరఖాస్తు నమూనా ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పోలీసు, ఫైర్ వంటి యూనిఫాం సర్వీసుల్లో శారీరక దారుఢ్యం, వైద్య ప్రమాణాలు అత్యంత కీలకమైనందున అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు సివిల్ సర్జన్ ద్వారా వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. అర్హత ప్రమాణాలు లేక చివరి దశలో నిరాశ చెందకుండా ఉండేందుకు ఈ సూచన చేసినట్లు పేర్కొన్నారు. ఎస్‌సి ఉపవర్గీకరణ ధ్రువపత్రాలు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు, బిసి అభ్యర్థుల నాన్-క్రీమీ లేయర్ ధ్రువపత్రాలు, స్థానిక అభ్యర్థిత్వ ధ్రువపత్రాలు, ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్లు తదితర అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు.