మన తెలంగాణ/కౌటాల: సిర్పూర్ నియోజకవర్గంలో 22 ఏ నిషేధిత జాబితాలో చేర్చిన భూములను వెం టనే తొలగించాలని, లేనిపక్షంలో కలెక్టరేట్ల ముట్టడి, వంటా వార్పు కార్యక్రమాలతో ఉద్యమాన్ని ఉధృ తం చేస్తామని మాజీ మంత్రి తన్నీ రు హరీశ్‌రావు హెచ్చరించారు. కొ మురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటా ల మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన 22 ఏ వ్యతిరేక సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు, పే దల భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు.

హైదరాబాద్ పరిసరాల్లో రెం డు లక్షల ఇళ్లు, సిర్పూర్ ప్రాంతంలో 42 వేల ఎకరాల భూమి 22 ఏ పరిధిలోకి వెళ్లిందని పేర్కొన్నారు. భూముల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చామని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 32 నెలలు పూర్తయినా ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు.


తమ సమస్యలను ముఖ్యమంత్రికి వివరించేందుకు వెళ్లిన రైతులను అరెస్టు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. పోడు, 22 ఏ భూముల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో రహదారులు అధ్వాన్నంగా మారాయని, యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కొండపల్లి రైతులకు పట్టాలు ఇప్పిస్తామన్న హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, నడిపెల్లి దివాకర్, మాజీ జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణ, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.