అడవిలో బిడి ఆకులు ఏరుకోవడానికి వెళ్లిన నలుగురు మహిళలపై ఒకేసారి పులి దాడి చేసింది. మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లా గంజేవాహి అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఈ భయానక ఘటన చోటు చేసుకుంది. దీంతో సిందేవహి తాలుకాలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ఉదయం పెద్ద సంఖ్యలో గ్రామీణ ప్రజలు ఎండిపోయిన బీడీ ఆకులు ఏరుకొనేందుకు అటవీ ప్రాంతంలోకి వెళ్లడం అక్కడ సర్వసాధారణం. శుక్రవారం ఉదయం కూడా గంజేవాహి ప్రాంతానికి చెందిన కొందరు మహిళలు వెళ్లారు. దాదాపు ఉదయం 8 గంటల సమయంలో ఓ పులి మాటువేసి వారిపై దాడి చేసింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం బాధితులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అది భయంకరంగా విరుచుకుపడింది. దీంతో ఘటనా స్థలంలోనే నలుగురు మహిళలు ప్రాణాలు విడిచారు. మృతులను కవుదుబాయి దాదాజీ మొహర్లే, అనుబాయి దాదాజీ మొహర్లే, సంగీతా సంతోష్‌ చౌదరీ, సునీతా కౌశిక్‌ మొహర్లేగా గుర్తించారు. వీరంతా 33 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్యవారే.