తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అవమానకరంగా వ్యాఖ్యలు చేస్తున్న వారి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ టిపిసిసి క్రమశిక్షణా కమిటి ఛైర్మన్ మల్లు రవికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె మల్లు రవికి శనివారం లేఖ రాశారు. టిపిసిసి క్రమశిక్షణా కమిటీ తనకు జారీ చేసిన నోటీసుకు ఇప్పటికే వివరణ సమర్పించినప్పటికీ, తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు బహిరంగంగా అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేస్తుండటంపై కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వెనుక ఉండి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న అసలు వ్యక్తులు ఎవరో నిష్పాక్షికంగా గుర్తించి, వారిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ రాశారు. పార్టీ క్రమశిక్షణా కమిటీ విచారణ కొనసాగుతున్న సమయంలోనే తనపై బహిరంగంగా విమర్శలు చేయడం, రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇవ్వడం,

తనపై చర్యలు తీసుకోవాలని మీడియా ముందు డిమాండ్ చేయడం ద్వారా క్రమశిక్షణా కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా అనే అంశాన్ని కూడా కమిటీ పరిశీలించాలని కోరారు. పార్టీ క్రమశిక్షణపై తనకు పూర్తి గౌరవం ఉందని, అదే సమయంలో, ఒక సీనియర్ బీసీ మహిళా నాయకురాలైన తనపై తీవ్ర మాటలతో సామూహిక దాడులు జరుగుతున్నప్పుడు పార్టీ నాయకత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇస్తూ, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మీడియా ముందుకు రావడం వెనుక ఉన్న ఉద్దేశాలను కూడా పార్టీ నాయకత్వం పరిశీలించాలని మంత్రి సురేఖ కోరారు. పార్టీ ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి కట్టుబడి వున్న పార్టీ అని, ఆ విలువలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై పార్టీ క్రమశిక్షణా నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

..........................