
మన తెలంగాణ/హైదరాబాద్/ఘట్‌కేసర్: మీ హయాంలో నోటిఫికేషన్లు తప్ప ఉద్యోగాలు ఎం దుకు భర్తీ చేయలేదు, తాము ఏడాదిలోనే 70 వేల ఉద్యోగాలు భర్తీ చేసి చూపించామని సిఎం రేవంత్ రెడ్డి బిఆర్‌ఎస్‌ను ప్రశ్నించారు. ఆనాడు కవితను, వినోద్ రావును ప్రజలు తిరస్కరిస్తే వా రికి ఉద్యోగాలు ఇచ్చిన మీరు(బిఆర్‌ఎస్) తెలంగాణ బిడ్డల ఉద్యోగాల కోసం ఒక్కనాడైనా ఆలోచించారా అని నిలదీశారు. మేం నోటిఫికేషన్లు ఇస్తే వాటిని భర్తీ చేశామని సిఎం రేవంత్ రెడ్డి ని స్సిగ్గుగా మాట్లాడుతున్నారని కెటిఆర్ చేసిన వ్యా ఖ్యలపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రజాకవి అందె శ్రీ జయంతి సందర్భంగా శనివారం ఘట్‌కేసర్ లో ఆయన స్మృతి వన నిర్మాణానికి ముఖ్యమం త్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేపర్ లీకేజీలతో వందల కోట్లు సంపాదించుకున్నారు తప్ప పరీక్ష లు నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేయాలని మీ కుటుంబం(కెసిఆర్) ఏనాడైనా ఆలోచించిందా అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.నిరుద్యోగుల పట్ల మీరెప్పుడైనా మనుషుల్లా ప్రవర్తించారా? మానవీయ కోణంలో చూశారా? అని విరుచుకుపడ్డారు. మేం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీకి అన్ని అడ్డంకులను తొలగించి వాటిని భర్తీ చేస్తూ వస్తున్నామన్నారు.
ఎల్బీ స్టేడియం సాక్షి గా, శిల్పకళా వేదిక సాక్షిగా తల్లిదండ్రుల ముం దు ఆ బిడ్డలకు ఉద్యోగ నియామక పత్రాలు అం దించామని సిఎం గుర్తు చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి వారి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూశామన్నారు. నిరుద్యోగులు బిఆర్‌ఎస్ మాయగాళ్ల మాయలో పడొద్దని, ప్రభుత్వం ప్రతీ ఉద్యోగ ఖాళీని భర్తీ చేసి నియామక పత్రాలు అందిస్తుందన్నారు. మీ పదేళ్ల పాలనలో కూతురు కవితకు పదవి ఇచ్చుకున్నారు కానీ శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మీకు గుర్తుకు రాలేదా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. తాము శంకరమ్మను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించామని, చాకలి ఐలమ్మ మనుమరాలిని మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించామని, కోదండరాంను ఎమ్మెల్సీ చేసుకున్నామని, 9 మంది కవులను సన్మానించి కోటి రూపాయల నగదు బహుమతి ఇచ్చి గౌరవించుకున్నామని ముఖ్యమంత్రి వివరించారు. అలాంటి తమ ప్రజా ప్రభుత్వం ఎందుకు పోవాలని సిఎం ప్రశ్నించారు. మీ కుటుంబం తెలంగాణను దోచుకునేందుకా?, మీ కుటుంబం పదవుల కోసమా? అని నిప్పులు చెరిగారు. మీరు మీ కుటుంబ సభ్యులు రాసి పెట్టుకోండి, 2034 వరకు తమ ప్రజా ప్రభుత్వానిదే అధికారం అన్నారు. ఇదే భవిష్యత్, ఇదే చరిత్ర, ఇక మీకు గతమే తప్ప భవిష్యత్ లేదన్నారు.
మేక తోలు కప్పుకున్న తోడేలు ఇవాళ మాట్లాడుతోందని పరోక్షంగా కెటిఆర్‌ను ఉద్దేశించి సిఎం మాట్లాడుతూ, ఈ తోడేళ్ల గుంపును నేను ప్రశ్నిస్తున్నా, మీరు శ్రీమంతులు ఎలా అయ్యారు? తెలంగాణ అప్పుల్లో ఎలా కూరుకుపోయిందని ప్రశ్నించారు. గజ్వేల్ లో మిమ్మల్ని రాజకీయ సమాధి చేసే బాధ్యత మా యువకులే చూసుకుంటారని అన్నారు. తెలంగాణ సమాజం మీకు ఏం తక్కువ చేసిందన్నారు. నేను ఉన్నంత వరకు ఈ తెలంగాణ తులసి వనంలో గంజాయి మొక్కను మొలకెత్తనివ్వమన్నారు. మాకు అందెశ్రీ, గద్దర్, సోనియా గాంధీ స్ఫూర్తి అని, మీకు స్ఫూర్తి నిజాం, ఖాసీం రిజ్వీలా అని ప్రశ్నిస్తూ మీకు మాకు పోలికేంది, పోటీ ఏంటి అని సిఎం ధ్వజమెత్తారు. మీ దోపిడీని ప్రజలు ఇంకా మరిచిపోలేదని, తెలంగాణ సమాజం అన్నీ గమనిస్తోందన్నారు. నిజాంను దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ గడ్డది, తెలంగాణ చైతన్యం ముందు మీరెంత, మళ్లీ తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదన్నారు. తెలంగాణను ఎవరూ చెరబట్టలేరు, చెరబట్టాలని చూస్తే అందెశ్రీ పాటగా తిరిగి వస్తారని సిఎం పేర్కొంటూ తమ ప్రభుత్వం అందెశ్రీ స్ఫూర్తితో పనిచేస్తోందన్నారు.
అందెశ్రీ నాకు ఒక ఆత్మ బంధువు
అందెశ్రీ నాకు ఒక ఆత్మ బంధువని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో గత పాలకుల అహంకార వైఖరిపై అందెశ్రీ గళమెత్తారని, నిరాశ, నిస్పృహలకు లోనైనప్పుడు అందెశ్రీ నాకు స్ఫూర్తిగా నిలబడేవారని గుర్తు చేశారు. అందెశ్రీ పాటలు తూటాలై, మరపిరంగులై గడీలను బద్దలు కొట్టాయని, ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడటానికి అందెశ్రీ స్ఫూర్తి చెప్పారు. ఇటుకపై ఇటుక పేర్చిన తాపీ మేస్త్రి, అక్షరాలపై అక్షరాలని పేర్చి ఉద్యమ గీతాలు రాసి, ప్రజల్లో చైతన్యం నింపారని సిఎం కొనియాడారు. ఆయన పాట గుండెల్లో ఒక చైతన్యాన్ని నింపిందని, ఆయన రాసిన జయ జయహే తెలంగాణ గీతం రాష్ట్ర గీతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలుస్తుందని ఆనాడు భావించామన్నారు. కానీ గత పదేళ్లలో కుట్రలతో ఆయన పాటను వినిపించకుండా చేశారని, పెన్నులపై మన్ను కప్పితే గనులై మొలకెత్తుతాయని అన్నట్లుగా, ఇప్పుడు తెలంగాణ ప్రతీ బడిలో, ప్రతీ గడపలో ఆయన పాట వినిపిస్తోందని సిఎం అన్నారు. ఆత్మగౌరవంతో ఆయన ఏనాడు దొరల గడప తొక్కలేదని, తన పాట కోట్లాది తెలంగాణ ప్రజల కోసం తప్ప,
గడీలలో దొరల కోసం కాదని అందెశ్రీ నిటారుగా నిలబడ్డారని తెలిపారు. మనందరం దండు కట్టి విష సర్పాలను తుదముట్టించాలని ఆయన అన్న మాటలు నాకు ఇంకా గుర్తొస్తున్నాయి అని సిఎం అన్నారు. నా కుటుంబంలో పెద్దన్నగా అందెశ్రీని భావించానని, ఏ రోజైతే అందెశ్రీ గళాన్ని బంధించాలనుకున్నారో, గద్దరన్నను అవమానించారో, ఆనాడే గడీల పాలనను శాశ్వతంగా పాతరేయాలని నిర్ణయించుకున్నట్లు సిఎం చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ బీ బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, పోచారం డివిజన్ అధ్యక్షుడు కర్రె రాజేష్, ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్ రెడ్డి, ఎదులాబాద్ డివిజన్ అధ్యక్షుడు సామల అమర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











