ఎయిరిండియా ప్రయాణికుల విమానం అనుకోకుండా పాకిస్థాన్ గగనతలంలో కొద్ది సేపు సంచరించింది. ఢిల్లీ నుంచి అమృత్‌సర్ వెళ్లే ఈ విమానం సోమవారం అర్థరాత్రి వేళలో పాకిస్థాన్ గగనతలంలో ఉండాల్సి వచ్చింది. దీనిపై ఇప్పుడు మంగళవారం భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ డిజిసిఎ వివరణ వెలువరించింది. అమృత్‌సర్ ఎయిర్‌పోర్టులో విమానం దిగాలి. అయితే రన్‌వేపై కొన్ని తనిఖీలు జరపాల్సి ఉండటంతో విమానం వెంటనే ల్యాండింగ్ చేయవద్దని పైలట్లను ఆదేశించారు. దీనితో ఆకాశంలో చక్కర్లు కొట్టే దశలో ఈ విమానం కొన్ని నిమిషాల పాటు పాక్ గగనతలంలో ఉండాల్సి వచ్చింది. వెంటనే పాకిస్థాన్ విమాన నిర్వహణ సంస్థ అధికారులతో మాట్లాడారు.

విషయం తెలియచేసి, సమన్వయం కుదిరేలా చేశారు. వెంటనే ఈ విమానం అమృత్‌సర్‌కు కాకుండా తిరిగి ఢిల్లీకి బయలుదేరి క్షేమంగా ల్యాండ్ అయింది. ప్రయాణికుల భద్రతా క్రమంలోనే తక్షణ చర్యలకు దిగామని ఎయిరిండియా తెలిపింది. వేరే దేశంలోకి విమానం వెళ్లడం అనుకోకుండా జరిగిందని వివరణ ఇచ్చారు. అయితే విమానం ల్యాండింగ్ దశలో రన్‌వే తనిఖీల పని పెట్టుకోవడం, ల్యాండింగ్ గందరగోళంపై అమృత్‌సర్ విమానాశ్రయ అధికారులు, రన్‌వే సిబ్బందిపై తాత్కాలిక చర్యలకు దిగినట్లు డిజిసిఎ తెలిపింది. పొరుగుదేశంలోకి విమానం వెళ్లాల్సి రావడం అత్యంత కీలక పరిణామంగా గుర్తించినట్లు తెలిపారు.