న్యూఢిల్లీ: తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రాజ్యసభలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే ప్రతిపాదన లేదని స్పష్టం చేసింది. దీనిపై సిడబ్ల్యూసికి వచ్చిన ప్రతిపాదనలు, డిపిఆర్‌ను వెనక్కి పంపినట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర జలవివాద అంశాలు ముడిపడి ఉన్నాయని పేర్కొంది. కాంగ్రెస్ ఎంపి రేణుకా చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషన్ చౌదరి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.

‘‘ఏదైనా నీటి పారుదల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించేందకు సాంకేతిక పరిశీలన జరగాలి. ఆ తర్వాత గంగా పునరుజ్జీవ సలహా సంఘం ద్వారా సాంకేతిక, ఆర్థిక మదింపు జరపాల్సి ఉంటుంది. దీని కోసం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ిన అంశాలనూ పరిశీలించాల్సి ఉంటుంది. పాలమూరు-రంగారెడ్డిలో కృష్ణా నదీ జలాల వినియోగం ఇమిడి ఉన్నందున అంతర్రాష్ట్ర జల వివాద అంశాల ముడిపడి ఉన్నాయి. కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ విధి విధానాలలో చేర్చినందున ఈ విషయం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉంది. న్యాయస్థాన పరిధితో ముడిపడి ఉన్న ఈ ప్రాజెక్టును ప్రస్తుత దశలో సాంకేతిక-ఆర్థిక మదింపునకు తీసుకోవడం సాధ్యం కాదు’’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.