
మన తెలంగాణ/హైదరాబాద్: పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం తమ పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హో దా కల్పించడంపై కేంద్ర కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్టుపై కేంద్రం స్పందిస్తూ కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్ 2 పరిధిలో అంతరాష్ట్ర అంశాలు ఉన్నందున ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ‘టెక్నో ఎకనామిక్ అప్రైజల్’ (సాంకేతిక-ఆర్థిక అధ్యయనం) ప్రక్రియను ప్రస్తుతం చేపట్టలేమని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాకుండా, తెలంగాణ ప్రభుత్వం మరింత సమగ్రమైన ప్రణాళికతో రావాల్సి ఉం దంటూ పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు సమగ్ర నివేదికను కేంద్రం తిరిగి వెనక్కి పంపించింది. కృష్ణా నీటి కేటాయింపులపై
స్పష్టత వచ్చే వరకు ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అందించే ఆర్థిక సహాయం విషయంలోనూ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) నిబంధనలకు అనుగుణంగా అన్ని రకాల అనుమతులు, క్లియరెన్స్ సాధించిన తర్వాతే జాతీయ హోదా ప్రాజెక్టుల పురోగతి సాధికార కమిటీ పరిశీలిస్తుందని కేంద్రం తెలిపింది. సమగ్ర ప్రణాళికతో డిపిఆర్ మళ్లీ సమర్పించాలని కేంద్రం సూచించింది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదాపై కేంద్రం చేసిన ఈ ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ ఎంపి రేణుకాచౌదరి రాజ్యసభలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు జాతీయ హోదా గురించి ప్రశ్నించింది. ఈ క్రమంలోనే ఎంపి రేణుకాచౌదరి ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి సహాయమంత్రి రాజ్‌భూషణ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.








