
లక్నో: పాలల్లో మత్తు మందు కలిపి భర్తకు ఇచ్చి అనంతరం పడుకున్న తరువాత భర్తపై భార్య పాము విసిరేసింది. పాముకాటుతో తన భర్త చనిపోయాడని భార్య నమ్మించి హత్య క్రియలు పూర్తి చేసింది. పోలీసుల విచారణలో దొరికిపోవడంతో భార్యతో పాటు ప్రియుడ్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మేరఠ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... హస్తినాపూర్‌లో అతుల్ పవార్(35), దామిని(30) అనే దంపతులు నివసిస్తున్నారు. ఏడు సంవత్సరాల క్రితం వీరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. కృష్ణ కిడ్స్ పబ్లిక్ స్కూల్‌ను ఈ దంపతులు నిర్వహిస్తున్నారు. స్కూల్‌లో 150 మంది పిల్లల వరకు ఉంటున్నారు. స్కూల్ వ్యాన్ డ్రైవర్‌తో దామినికి పరిచయం ఉండడంతో వివాహేతర సంబంధానికి దారితీసింది. అక్రమ సంబంధానికి అతుల్ అడ్డుగా ఉండడంతో అతడిని తొలగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. జులై 16 రాత్రి భర్తకు భార్య అధిక మోతుదులో పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. భర్త గాఢ నిద్రలోకి జారుకున్న తరువాత అతడి దుప్పట్లో పామును విడిచింది. పాము కాటువేయడంతో భర్త చనిపోయాడని అందరినీ నమ్మించింది. మృతుడి మంచంపై పాము కనిపించడంతో అతడి తల్లిదండ్రులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. దామిని కాల్ హిస్టరీ ఆధారంగా డ్రైవర్‌తో పాటు పాములు ఆడించే సోను, ఉదయ్ కుమార్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తామే చేశామని ఒప్పుకున్నారు. వెంటనే నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.











