
చెన్నై: విశ్వాసానికి మారుపేరు కుక్క. తనకు కాస్త ఆహారం పెట్టి, ప్రేమ చూపించిన వారిని జీవితాంతం గుర్తుంచుకుంటాయి. యజమాని కోసం ప్రాణాలనైనా అర్పిస్తాయి. వాటి ప్రేమ స్వచ్ఛమైనది, నిస్వార్థమైనది. ప్రపంచవ్యాప్తంగా కుక్కలు తమ యజమానుల పట్ల చూపే అనంతమైన ప్రేమకు సంబంధించిన ఘటనలు అనేకం ఉన్నాయి. యజమానిని కాపాడేందుకు ఓ కుక్క నాగు పాముతో పోరాడి తన ప్రాణాలను పణ్ణంగా పెట్టింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం కన్నియకుమారి జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... తక్కలైలో వికేష్, గాయత్రి అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గాయత్రి తల్లి పద్మ కుమారి కూడా వీళ్లతో పాటు ఉంటుంది. గత రెండు సంవత్సరాల నుంచి చించాన్ అనే కుక్కను పెంచుకుంటున్నారు. ఆ శునకం వీరితో ఎంతో విశ్వాసంగా ఉండేది. పద్మ కుమారి ఇంటి వెనుక ఉన్న ఆరుగుపై కూర్చుంది. అదే సమయంలో నాగు పాము బుసలు కొడూ పద్మ కుమారి దగ్గరికి వచ్చింది. వెంటనే శునకం పాముతో పోరాటం చేసింది. పాము కాటు వేసింది. పామును శునకం కరిచి రెండు ముక్కలు చేసి అనంతరం ప్రాణాలు విడిచింది. యజమాని కోసం శునకం తన ప్రాణాలను విడిచింది. కుక్క విశ్వాసం ముందు ఎవరు పనికిరారని అంటారు. శునకం చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీంటిపర్యంతమయ్యారు.











