న్యూఢిల్లీ: జులై 20న చేపట్టనున్న పార్లమెంట్ ముట్టడిని దేశానికి ‘రెండో స్వాతంత్య్ర ఉద్యమం’గా సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ అభివర్ణించారు. అన్యాయం నుంచి విముక్తి, భయం నుంచి స్వేచ్ఛ కోసం ఈ ఉద్యమం జరుగుతోందని పేర్కొంటూ, భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వాంగ్‌చుక్, తన భార్య గీతాంజలి జే. ఆంగ్మో ద్వారా చేతిరాత సందేశాన్ని విడుదల చేశారు. ఆ సందేశాన్ని ఆయన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

ఆ సందేశంలో.. ‘జులై 20, భారతదేశ రెండో స్వాతంత్య్ర ఉద్యమం. ప్రశ్నపత్రాల లీకేజీల వంటి అన్యాయాల నుంచి స్వేచ్ఛ... నా అక్రమ నిర్బంధం వంటి భయం నుంచి విముక్తి. పార్లమెంట్‌కు మార్చ్ నిర్వహించండి. దీన్ని ఘన విజయవంతం చేయండి’ అని పేర్కొన్నారు. అలాగే, ‘సఫ్దర్‌జంగ్‌లో నా అక్రమ నిర్బంధం నుంచి గీతాంజలి ద్వారా పంపిస్తున్న సందేశం’ అంటూ తన సందేశాన్ని ముగించారు. తాను కోరుకోకపోయినా జంతర్‌మంతర్ నిరసన స్థలం నుంచి బలవంతంగా తీసుకెళ్లి, తన ఇష్టానికి విరుద్ధంగా సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో ఉంచారని వాంగ్‌చుక్ గతంలో చేసిన ఆరోపణలను ఈ సందేశం మరోసారి పునరుద్ఘాటించినట్లుగా భావిస్తున్నారు.