
న్యూఢిల్లీ : కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) పార్లమెంట్ ర్యాలీలో ఆందోళనకారులపై లాఠీ ఛార్జ్ చేసినందుకు ఢిల్లీ హైకోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పబ్లిసిటీ కోసం విద్యార్థులు నిరసనల్లో పాల్గొన్నారని పోలీసులు చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టింది. సీసీ కెమెరాలు, పోలీసుల బాడీ కెమెరాల ఫుటేజీలు, నిరసనలకు సంబంధించిన అన్నిడిజిటల్ రికార్డులను భద్రపర్చాలని ఆదేశించింది. నిరసనకారులతో అమానుషంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై నాలుగు వారాల్లోగా పోలీసులు స్పందించాలని పేర్కొంది.
సీజేపీ ఆందోళనకారులపై పోలీసుల లాఠీఛార్జ్‌ను సవాల్ చేస్తూ నమోదైన పిటిషన్లపై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది. శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపై పోలీసులు బాష్పవాయు ప్రయోగం, లాఠీ ఛార్జి చేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయని ఆందోళనకారులు తమ పిటిషన్లలో పేర్కొన్నారు. పోలీసులే తమపై దాడి చేశారు కాబట్టి ఈ సంఘటనపై దర్యాప్తును వారికి అప్పగించకుండా ప్రత్యేక దర్యాప్తు దళాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.











