న్యూఢిల్లీ: దేశంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమయిందని, విద్యార్థుల గోడు పట్టించుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో విద్యావ్యవస్థ మొత్తం రిగ్గింగ్ బారిన పడిందన్నారు. గత పదేళ్లలో 152 పేపర్ లీక్ ఉదంతాలు వెలుగు చూశాయని చెప్పారు. ఒక్క కేసులోనూ దోషులు ఎవరో తేలలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీక్ ఉదంతంపై ఉద్యమిస్తున్న యువతకు మద్దతుగా రాహుల్ గాంధీ బుధవారంనాడిక్కడ మీడియా సమావేశంలో మా ట్లాడారు. చేతికి నల్లబ్యాడ్జి ధరించి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. విద్యార్థులపై దాడి దృశ్యాలను కూడా ఈ సందర్భంగా ఆయన ప్రదర్శించారు.

దేశంలో విద్యావ్యవస్థ రిగ్గింగ్ కావడంతో లక్షలాది మంది విద్యార్థులు, కుటుంబాలు భారీ మూల్యం చెల్లించుకున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. ప్రపంచంలోనే అత్యున్నతమైన మన విద్యా వ్యవస్థ ఈరోజు రిగ్గింగ్ సిస్టమ్‌గా మారిందని విమర్శించారు. చివరి నిమిషంలో ప్రశ్నపత్రాల లీకేజీ వంటి ఘటనలతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. మధ్యతరగతికి వారికి చదువు ఆర్థిక భారంగా మారిందని చెప్పారు. కోచింగ్‌పై నీట్ అభ్యర్థుల వార్షిక ఖర్చు రూ.1.32 కోట్లని అన్నారు. విద్యపై రూ.1.4 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్టు కేంద్రం చెబుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా 152 పరీక్షల పత్రాలు ఎలా లీక్ అయ్యాయని ప్రశ్నించారు. ఇందువల్ల 7.50 కోట్ల విద్యార్థులు నష్టపోయారని చెప్పారు. విద్యార్థుల గోడు మాత్రం ప్రభుత్వానికి పట్టడం లేదని, ఈ ఘటనల్లో శిక్షపడిన నేరస్థుల సంఖ్య సున్నా అని అన్నారు. సంపన్నుల కోసమే ఉద్దేశించిన ఈ వ్యవస్థలో పేదలకు స్థానం లేకుండా పోయిందన్నారు.

విద్యార్థులు చేసిన తప్పేంటి?

విద్యార్థులు చేసిన తప్పేమిటి? వారిపై భద్రతా బలగాలు ఆయుధాలు ఎక్కుపెట్టడం, దారుణంగా కొట్టడం, తీవ్రంగా అవమానించడం ఏమిటి? ధర్మేంద్ర ప్రధాన్‌ను సాగనంపాలి, ఆయన ఆ పదవిని నిర్వహించడానికి ఎంతమాత్రం సమర్ధుడు కారు.. అని రాహుల్ అన్నారు. జవాబుదారీతనం కలిగిన నిష్పాక్షిక విద్యా వ్యవస్థను విద్యార్థులు కోరుకుంటూ శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే పోలీసులు దమనకాండకు పాల్పడ్డారని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు లీక్ కారకులకు కఠిన శిక్షలు పడాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారని, మోదీ క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారని పేర్కొన్నారు. లీక్‌లపై జవాబుదారీతనాన్నేవిద్యార్థులు కోరుతున్నారని చెప్పారు. తమ ఆందోళనలపై దాడికి దిగిన వారికి శిక్ష పడాలని కోరుతున్నారని, విద్యార్థుల డిమాండ్లకు తాము పూర్తి మద్దతు ప్రకటించామని చెప్పారు.

విద్యార్థులు శత్రువులు కారు

దేశంలోని యువత ఆశలు, ఆకాంక్షలను ఈ ప్రభుత్వం నాశనం చేస్తోందని రాహుల్ విమర్శించారు. పనిచేయడానికి ఉద్యోగాలు లేవని, కేంద్ర విధానాల వల్ల పేదలు, విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు. చైనా వస్తువులు పెరిగిపోవడం, పరిశ్రమలు మూతపడటంతో పాటు బడా వ్యాపారులు బ్యాంకులను లూటీ చేస్తున్నారని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కార్పొరేట్ రంగంలో ఉద్యోగాలు పోతున్నాయని అన్నారు. విద్యార్థులు దేశానికి శత్రువులు కాదని, వారే దేశ భవిష్యత్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.

అందుకే రోడ్లపైకి వచ్చాం

విద్యా వ్యవస్థ, ప్రశ్నపత్రాల లీకేజీలు, విద్యార్థుల సమస్యలపై పార్లమెంటులో మాట్లాడేందుకు కేంద్రం అవకాశం ఇవ్వడం లేదని రాహుల్ ఆరోపించారు. దీంతో విద్యార్థులకు మద్దతుగా తాము రోడ్లపైకి వచ్చామని, విద్యార్థుల ఆందోళనను తాము ఎంతమాత్రం రాజకీయాలకు వాడుకోవడం లేదని రాహుల్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ చేపట్టిన నిరసనల్లో తన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై మాట్లాడుతూ, ఆ విషయంలో తాను బాధపడటం లేదని, విద్యార్థులకు జరుగుతున్న నష్టం విషయంలోనే బాధగా ఉందని అన్నారు. పరీక్షల విధానంలో మార్పులు రావాలని, అందుకోసం తాను ఎన్ని దెబ్బలైనా తినడానికి సిద్ధమేనని అన్నారు. విద్యార్థులకు అండగా తాముంటామని చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యార్థులపై దాడి చేసిన వారిని జవాబుదారిగా చేయాలని, విద్యార్థులకు మోదీ క్షమాపణ చెప్పాలని విద్యార్థులు చేస్తున్న డిమాండ్లకు తాము మద్దతిస్తున్నట్టు చెప్పారు.