నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) నేతృత్వంలో యువత చేపట్టిన ఆందోళన రక్తసిక్తంకావడం, ఆ తర్వాత ప్రభుత్వం దిగివచ్చి వారి ప్రధాన డిమాండ్ల మేరకు విద్యా మంత్రి రాజీనామా చేయడం.. అంతా దేశంలో ఎవరూ ఊహించని పరిణామంగా జరిగిపోయింది. ముందెన్నడూ లేనంత గొప్ప పాలనను పన్నెండేళ్లుగా అందజేస్తున్నామంటున్న ఎన్‌డిఎకి కాక్రోచ్ పార్టీ షాక్ నిచ్చిందని చెప్పవచ్చు. బిజెపికి ఇది మయసభలో దుర్యోధనుడికి ఎదురైనా పరాభవం లాంటిదే. ఏ దేశానికి వెళ్లినా అక్కడి భారతీయులు ‘మోడీ.. మోడీ’ అంటూ పిడికిలెత్తి హోరెత్తుతుంటే రొమ్ము విరుచుకొని చిరుదరహాస మందగమన గంభీర వదనంతో దర్శనమిచ్చే మన ప్రధాని మోడీకి కాక్రోచ్ దెబ్బ జీర్ణించుకోలేనిదే. తన సాటి, తనను మించిన ప్రధాని దేశచరిత్రలో నభూతో నభవిష్యతి అన్న రీతిలో మోడీ నిర్మించుకుంటున్న కీర్తి శిఖరానికి ఇదో పిడుగు దెబ్బగా చెప్పవచ్చు.

ఇంతకాలం తన చాణక్య వ్యూహం, భాషణా చాతుర్యంతో దేన్నైనా కనికట్టు చేసే మోడీ కాక్రోచ్ ముందు మాంత్రికుని మంత్రం దండం పని చేయనట్లు మిన్నకుండిపోయారు. అన్నింటికీ మోడీ ఉన్నారులే అని ధీమాగా ఉండే బిజెపి, హిందూ వర్గాలకు కూడా ఇది మింగుడు పడనిదే. మోడీ కూడా ఫెయిల్ అయ్యే పరీక్షలు ముందున్నాయనే భయం కూడా వారిలో చోటుచేసుకుంటుంది. ప్రభుత్వంలో, పార్టీలో ఆయనపై అంచనాలు మారిపోతాయి. కాక్రోచ్ వల్ల కూలిపోయిన ప్రతిష్ఠను తిరిగి నిర్మించుకొని ముందుకు సాగే ఆగత్యం ప్రస్తుతం బిజెపి ముందు ఉంది. మోడీ తృప్తిగా దిగిపోయాక ఆయన వారసులుగా ప్రధాని పీఠాన్ని ఎక్కాలని ఆశపడే నాయకులు ఎందరో ఉన్నారు. కాక్రోచ్ ధాటికి పడ్డ రంధ్రాన్ని మూసేసి ఎన్‌డిఎ పడవను సముద్రాలు దాటించే ప్రణాళిక వారి అవసరం.

ఇప్పటికే దేశంలో పౌరులు కొందరు కాక్రోచ్ యువత వైపు, ఇంకొందరు వారికి వ్యతిరేక దిశగా, కొంత తటస్థత వైపు వెళ్లిపోయారు. కాక్రోచ్ జనతా పార్టీ మాట నెగ్గించుకుంది. కాబట్టి మీడియా కొంత కాలం వారి వార్తలకు ప్రాధాన్యమిస్తుంది. జంతర్ మంతర్ వద్ద యువకులు గుమిగూడినంత కాలం వారి వెనుక విదేశీ శక్తులున్నాయని ఊదరగొట్టిన ప్రధాన జాతీయ మీడియా కూడా అదునుకోసం పొంచి ఉంటుంది. ఏ గిరిగీతలు లేని సోషల్ మీడియా ఇప్పటికే సిజెపిపై బురద చల్లడం మొదలు పెట్టింది. వాట్సాప్, ఫేస్ బుక్‌ల్లో ఆందోళనలో పాల్గొన్న యువతీయువకులపై అసహ్యకరమైన పోస్టులు వస్తున్నాయి. వాటిని సమర్థిస్తూ కామెంట్లు వరుస కడుతున్నాయి. కాక్రోచ్‌కు పోటీగా ‘రిజర్వేషన్లు రద్దు చేయాలి’ అనే డిమాండ్‌తో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా యువతను కూడగట్టాలనే ప్రయత్నం జరుగుతోంది. కళాకారులు, రచయితలు, పాత్రికేయులు, ఉద్యోగులు, అధ్యాపకులు.. ఇలా వివిధ జనప్రభావిత వృత్తుల్లో ఉన్నవారు కూడా మోడీని అనుకూలంగా బొద్దింకలపై అస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు. ‘కాక్రోచ్‌ల అసలు బాస్ యోగేంద్ర యాదవ్ కు అమెరికా వ్యాపార వర్గం ‘మోడీ హటావో’ బాధ్యత అప్పగించింది’ అనేది వాటిలో ఒకటి. ‘అభివృద్ధిని ఓర్వలేని వారి కుట్రల నుండి మోడీని కాపాడుకుందాం’ అంటూ వీడియోలు వస్తున్నాయి.

బిజెపి పాలిత రాష్ట్రాల పోలీసులు ఆందోళనలో పాల్గొన్న యువతపై చర్యలు మొదలుపెట్టారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన లాఠీచార్జీలో పోలీసులపై దాడి చేశారని బీహార్, అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో యువతను అదుపులో తీసుకుంటున్నారని సిజెపి నేతలు అంటున్నారు. ఆందోళనకారుల్లో వందల సంఖ్యలో నేరగాళ్లు పాల్గొన్నారని ఢిల్లీ పోలీసుల మాట. గుంపు కూడినప్పుడు ఎవరైనా అందులో దూరవచ్చు. వారిని విడిగా చూడాలి తప్ప ఆందోళనకారుల్లో భాగంగా పరిగణించవద్దు. దీనిని సాకుగా తీసుకుని నేరగాళ్ల సంఖ్య పెంచుకోవద్దు. మరోవైపు జంతర్‌మంతర్ వద్ద యువతకు కొన్ని రోజుల పాటు ఆహారం అందజేసిన జునైద్‌ను పోలీసులు వేధించడం మొదలైంది. ఆయన మానవతా దృక్పథానికి మెచ్చుకోవడం పోయి నీకింత డబ్బు ఎక్కడిది అని ఆరా తీయడం షురూ చేశారు. ఆయన కుటుంబ సభ్యుల గుర్తింపు కార్డులను పోలీసులు తీసుకున్నారని తెలుస్తోంది.

ఈ సందర్భంలో సిజెపి నేతలు కొంత సంయమనం పాటించాలి. ‘అసమర్థ పాలకుడైన మోడీ ప్రధాని పదవికి అనర్హుడు. వెంటనే రాజీనామా చేయాలి’ అని అభిజిత్ అనడం తప్పు మాట. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వ్యక్తిని దిగిపో అనే అధికారం ఏ ఒక్కరికీ ఉండదు. ఇది ఆరంభమే, చేసేది ఇంకా ఎంతో ఉంది అని వెంటనే వారు ప్రకటించే అవసరం లేదు. పంజాబ్‌లో పేపర్ లీక్‌పై ఆందోళన మొదలెడతాం అనేది తొందరపాటే. ముందుగా రాష్ట్రాల్లో కార్యకర్తలను కూడదీసుకుని ప్రణాళికాబద్ధంగా అడుగులేయాలి. అంతటా జంతర్ మంతర్ ఫలితాలు సాధ్యపడక పోవచ్చు.

కేంద్రం కూడా కాపుకాచి చావుదెబ్బ తీయాలని చూస్తోంది. ఒక్క వైఫల్యం దారులన్నిటిని మూసేస్తుంది. యువత దెబ్బకు డీలాపడిన ప్రభుత్వం బలగాలు చేతిలో ఉన్నాయని తొందరపడవద్దు.ఆందోళన తొలి అడుగుల్లోనే ప్రభుత్వం తప్పును ఒప్పుకుంటే ఎంతో హుందాగా ఉండేది. ఇప్పటికైనా అంతా కడుపులో దాచుకొని, మరచిపోయినట్లు వ్యవహరిస్తే ప్రభుత్వానికే మంచి పేరు. యువత విజయాన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వంపై కాలు దువ్వుతున్న కాంగ్రెస్, తదితర విపక్షాలను కట్టడి చేయడం బిజెపి తొలి అవసరం. ఇదే అమెరికాలో అయితే కాల్చివేసేవారని అంటూ పత్రికల ముందు చెప్పి బిజెపి నేతలు అభాసుపాలు కావద్దు. వాతావరణం ఇంకా యువత పక్షాననే ఉంది. తప్పు ఎత్తి చూపిన వారు శత్రువులు కాదు, మన దేశ పౌరులు.. భావి భారత నిర్మాతలు. పిల్లల ముందు పెద్దరికం కాపాడుకోవడంలోనే విజ్ఞత ఉంది.

- బి. నర్సన్ 9440128169