విద్యార్థులపై పెల్లెట్ గన్స్ పేల్చమని ఎవరు ఆదేశించారో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జి చేసిన అంశంపై కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా లోక్ సభలో సమాధానం చెప్పాలని సోమవారం పార్లమెంట్ ఆవరణలో ‘ఇండి’ కూటమి ఎంపీలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా చామల కిరణ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉన్నాయన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా హౌస్ పార్లమెంటుకు వచ్చి సమాధానం చెప్పడం లేదని విమర్శించారు. విపక్షాల ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పడం లేదని,

ప్రజల పక్షాన చట్ట సభల్లో ప్రభుత్వాన్ని నిలదీసే అధికారం ప్రజాప్రతినిధులకు ఉందని ఆయన తెలిపారు. కేంద్రం తనకు కావాల్సిన బిల్లులను ఆమోదించుకోవడానికే పార్లమెంటు సమావేశాలను నిర్వహిస్తున్నట్లు కనిపిస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. కేంద్ర మంత్రి అమిత్ షా లోక్ సభకు వచ్చి విద్యార్థులపై జరిగిన లాఠీ ఛార్జికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం బిల్లులపై పార్లమెంట్‌లో చర్చ పెడితే ఆ బిల్లుల ఆమోదానికి సంబంధించి ప్రతిపక్షాలుగా నిర్ణయం తీసుకుంటామన్నారు. కేంద్రం ప్రజాస్వామ్యబద్దంగా పార్లమెంట్ సమావేశాలను నిర్వహించాలని ఎంపీ చామల డిమాండ్ చేశారు.