పెళ్లయి బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్. కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఫిట్ నెస్, గ్లామర్‌తో ఆకట్టుకుంటోంది. డెలివరీ తర్వాత శారీరకంగా, మానసికంగా మరింత దృఢంగా తయారవ్వాలని నిర్ణయించుకుంది కాజల్. అందుకే కష్టమైన గుర్రపు స్వారీ నేర్చుకుంది. కాస్త ఎక్కువగా శ్రమ పెట్టే జిమ్ వర్కవుట్స్ కూడా చేయడం మొదలుపెట్టింది. అలా కొన్ని నెలల్లోనే పాత ఫిజిక్ సంపాదించానంటోంది ఈ బ్యూటీ. అయితే దీంతో పాటు ఆహారపు అలవాట్లు కూడా మార్చుకుందట కాజల్. గతంలా కాకుండా, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత రోజుకు 5-,6 సార్లు తినడం మొదలుపెట్టిందట. తక్కువ పరిమాణంలో ఎక్కువసార్లు భోజనం చేయడం అన్నమాట. ఆ తినే ఆహారంలో కూడా ఆకుకూరలు, నట్స్, తాజా పండ్లు ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుందట.

పెళ్లి తర్వాత రైస్‌కు పూర్తిగా దూరమైంది కాజల్. దీంతో పాటు ప్రాసెస్డ్ ఫుడ్ కూడా తీసుకోవడం ఆపేసింది. ఇలా కఠినమైన ఆహార నియమాలు కూడా పాటించడంతో తన అందాన్ని మరింత మెరుగుపరుచుకుంది. ఇక కాజల్ పూర్తి శాకాహారి. ప్రస్తుతం కాజల్ అగర్వాల్... రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ్’ మూవీతో పాటు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ‘ఎన్‌బికె111’ మూవీలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే బాలకృష్ణతో కలిసి ‘భగవంత్ కేసరి’ సినిమాలో నటించింది కాజల్ అగర్వాల్. ఇక ‘ది ఇండియా స్టోరీ’ అనే హిందీ మూవీలోనూ కీలక పాత్రలో నటిస్తోంది ఈ భామ. అలాగే ఆమె కమల్ హాసన్‌తో చేసిన ‘భారతీయుడు 2’ సినిమా త్వరలో విడుదల కానుంది.