
పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు 2026
ముసాయిదా విడుదల చేసిన కేంద్రం
సోమవారం లోక్‌సభ ముందుకు బిల్లు
న్యూఢిల్లీ: పేపర్ లీకేజీలు, అవకతవకలకు శాశ్వతంగా చెక్ పేట్టేందుకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. రెండేళ్ల క్రితం తీసుకువచ్చిన పేపర్ లీక్ నిరోధక చట్టానికి సవరణలు చేస్తూ బిల్లును తీసుకువస్తోంది. ఇందులో భాగంగా పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు-2026 డ్రాఫ్ట్ ను కేంద్రం శనివారంనాడు విడుదల చేసింది. ఈ కీలక సవరణ బిల్లును లోక్‌సభలో సోమవారంనాడు ప్రవేశపెట్టనుంది. బిల్లు ప్రతులను లోక్‌సభ సభ్యులకు సర్క్యులేట్ చేసింది.
సవరణ బిల్లు ప్రకారం, పరీక్షల్లో సాధారణ మోసాలు, అక్రమాలకు పాల్పడే వారికి కనిష్టంగా 5 ఏళ్ల నుంచి పదేళ్లకు పెంచారు. రూ.50 లక్షల వరకూ జరిమానా విధిస్తారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడితే కనీస జైలు శిక్ష ఏడేళ్లు, రూ.10 కోట్ల వరకూ జరిమానా విధిస్తారు. పరీక్షలు నిర్వహించే ఏజెన్సీలు, సర్వీసు ప్రొవైడర్లు అక్రమాలకు పాల్పడినట్లయితే రూ.5 కోట్ల వరకూ జరిమానా ఉంటుంది. అక్రమాలకు పాల్పడే సంస్థలను ఎనిమిదేళ్లు బ్లాక్‌లిస్ట్ లో ఉంచుతారు. పేపర్ లీక్ కేసుల్లో విచారణ రెండు నెలల్లో పూర్తి చేయాలి.
కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఛార్జిషీటు దాఖలైన 3 నెలల వ్యవధిలోనే విచారణ పూ ర్తి చేసి కోర్టులు తుది తీర్పు వెలువరించాల్సి ఉంటుంది. ఎలాంటి నేరాల విషయంలోనైనా అవసరమైతే స్పెషల్ టాక్స్ ఫోర్స్ ఏర్పాటు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. పరీక్షల నిర్వహణా వ్యవస్థలో పారదర్శకత పెంచడం, లీకేజీ ముఠాల ఆటకట్టించడం లక్ష్యంగా ఈ బిల్లును తీసుకువస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.











