
విపక్షాలు ఎలాంటి రాజకీయాలు చేయవద్దు
సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వంలో కలిసి పనిచేయాలి
గతంలో యూపీఏ హయాంలోనూ ప్రశ్నాపత్నాల లీక్‌లు జరిగాయి
కేరళ, పంజాబ్, కర్ణాటక, పశ్చిమబెంగాల్, తమిళనాడులోనూ లీక్‌లు
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ అంశంపై నిరసనలు కొనసాగుతుండటంపై కేంద్రం స్పందించింది. ఈ అంశంపై పార్లమెంటులో సమగ్ర చర్చ జరిపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో అధికార పక్ష నేత జేపీ నడ్డా హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ కానీ, ఇతర రాజకీయ పార్టీలు కానీ ఈ అంశాన్నిఎంతమాత్రం రాజకీయం చేయవద్దని కోరారు. ప్రస్తుత ప్రతిష్టంభనకు ఒక పరిష్కారం కనుగొనేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.
పేపర్ లీక్‌లపై విద్యార్థులు లేవనెత్తిన అంశాలు, డిమాండ్లకు సంబంధించి మాట్లాడుతూ, ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని తాను కోరుతున్నానని చెప్పారు. సమస్య తీవ్రత దృష్ట్యా దీనిపై లోతైన చర్చ జరగాల్సి ఉందని అన్నారు. ఇందుకు తాము సిద్ధంగా ఉన్నామని, పార్లమెంటులో చర్చ జరగడం ఉత్తమమని అన్నారు. అందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సమస్యను అన్ని కోణాల్లోనూ చర్చిద్దామని అన్నారు.
గతంలోనూ పేపర్ లీక్‌లు
నీట్-యూజీ పరీక్షా పత్రాల లీక్‌పై ప్రభుత్వం నుంచి జవాబుదారీతనం కోరుతున్నారంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై జేపీ నడ్డా సూటిగా స్పందించారు. లీకేజీలపై సమగ్ర విచారణ జరగాల్సిందేనని, అయితే గతంలో కూడా యూపీఏ హయాంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పేపర్ లీకేజీలు చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు. ఆ విషయాన్నిరాహుల్ గాంధీ ఎందుకు ప్రస్తావించడం లేదని నిలదీశారు. అప్పట్లో కేరళ, పంజాబ్, కర్ణాటక, పశ్చిమబెంగాల్, తమిళనాడులో పేపర్ లీక్‌లు, అవకతవకలు జరిగాయన్నారు. వాటి ప్రస్తావన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ’మీరు ఎందుకు అంత సెలక్టివ్‌గా మాత్రమే ప్రశ్నిస్తున్నారు? ఇండియా కూటమిలోని ప్రభుత్వాలను ఎందుకు మీరు ప్రశ్నించడం లేదు? దీనినిబట్టే మీ ఉద్దేశం ఏమిటో స్పష్టమవుతోంది. విద్యార్థులు మీ ప్రియారిటీ కాదని అర్ధమవుతోంది’ అని నడ్డా అన్నారు. విద్యార్థుల అంశాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారని రాహుల్‌ను విమర్శించారు.











