
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతుండటంతో హింస చోటుచేసుకుంది. నివేదికల ప్రకారం.. పాకిస్తాన్ భద్రతా దళాలు.. నిరసనకారులపై కాల్పులు జరపడంతో 30 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడినట్లు కూడా సమాచారం. ఈ అణచివేత తర్వాత అనేక మృతదేహాలు గల్లంతయ్యారు. పిఓకె అంతటా ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసినట్లు సమాచారం.
కాగా, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని అనేక సామాజిక, రాజకీయ సంస్థల కూటమి అయిన జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జెఎఎసి) ఆధ్వర్యంలో ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. జెఎఎసి ప్రకారం.. ఈ ప్రాంతంలోని 12 వివాదాస్పద స్థానాల చుట్టూ ఈ ఆందోళన నెలకొంది. పాకిస్తాన్ తనకు నచ్చిన ప్రధానమంత్రిని నియమించుకోవడానికి ఈ స్థానాలను తారుమారు చేస్తోందని ఆ సంస్థ ఆరోపిస్తోంది. రాజకీయ వివాదంతో పాటు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పరిపాలనా నిర్లక్ష్యం, రాజకీయ వివక్ష, మైనారిటీలపై జరుగుతున్న హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా నిరసనలు చెస్తున్నారు.











