మనతెలంగాణ/హైదరాబాద్: పోలీస్ ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియపై నిఘా వర్గాలు ముఖ్యమంత్రికి కీలక సమాచారం అందించాయి. నియామక ప్రక్రియకు ఎలాగైనా భంగం కలిగించాలని కొన్ని రాజకీయ పార్టీలతో పాటు ఇతర శక్తులు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు సిఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో డిజిపి సివి ఆనంద్ తో పాటు పోలీస్ ఉన్నతాధికారులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇటీవల విడుదలైన నోటిఫికేషన్‌కు సంబంధించి నియామక ప్రక్రియను పకడ్బందీగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని సిఎం అధికారులను ఆదేశించారు. నియమ, నిబంధనలను అనుసరించి ఎలాంటి లోపాలకు ఆస్కారం లేకుండా చూడాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, రవాణాపై అప్రమత్తంగా...

ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, రవాణాతో పాటు అన్ని ప్రక్రియలలో అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సిఎం ఆదేశించారు. ముఖ్యంగా కోచింగ్ సెంటర్‌లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సిఎం సూచించారు. నియామక పరీక్షల నిర్వహణపై సోషల్ మీడియా, ఇతర మాధ్య మాల్లో ఎలాంటి దుష్ప్రచారం జరగకుండా చర్యలు తీసుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసే దళారులు, నకిలీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లపై సైబర్ క్రైమ్ విభాగంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సిఎం సూచించారు. పరీక్షల నిర్వహణ పూర్తయ్యే వరకు సైబర్ సెక్యూరిటీ, ఇంటలీజెన్స్ విభాగం పూర్తి అప్రమత్తంగా వ్యవహారించాలని సిఎం ఆదేశించారు. ఈ అత్యవసర సమావేశంలో సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, డిజిపి సివి ఆనంద్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వి.వి.శ్రీనివాస రావు, సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.