
బెంగళూరు: బైక్‌పై వెళ్తుండగా అడవి పందిని తప్పించే క్రమంలో నవ వధువు మృతి చెందిన సంఘటన కర్నాటక రాష్ట్రం మైసూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నంజనగూడు ప్రాంతానికి చెందిన పునీత్, మోగనహుండి గ్రామానికి చెందిన మేఘనకు 15 రోజుల క్రితం పెళ్లి జరిగింది. ఆషాడ మాసం కావడంతో మేఘన తన పుట్టింటికి వెళ్లింది. భార్యను కలిసేందుకు పునీత్ కూడా అత్తగారింటికి వెళ్లాడు. అనంతరం భార్యతో కలిసి తన ఇంటికి బైక్‌పై వస్తున్నాడు. ఆర్‌టి నగర్ సమీపంలో అడవి పంది ఎదురు రావడంతో దానిని తప్పించే క్రమంలో బైక్ పైనుంచి ఇద్దరు కిందపడిపోయారు. మేఘనా తలకు బలమైన గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మేఘన చనిపోయింది. పునీత్ స్వల్ప గాయాలు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. పునీత్ హెల్మెట్ పెట్టుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు తెలిపారు. మేఘన కూడా హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాలలో ఉండేదని పోలీసులు తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.











