
హైదరాబాద్: తెలంగాణలో పండుగల పేరుతో ఆర్టీసి యాజమాన్యం ఛార్జీల మోత మోగిస్తోంది. పండగల సమయంలో 1:50 రూల్ పేరుతో ఆర్టీసి అదనంగా ఛార్జీలు వసూల్ చేస్తోంది. ఇక, శుక్రవారం రాఖీ పండగ సందర్భంగా మరోసారి ఆర్టీసి యాజమాన్యం.. స్పెషల్ బస్సుల పేరుతో అధిక ఛార్జీల వసూల్ చేస్తోంది. సాదారణ రోజుల కంటే 50 శాతం అదనపు ఛార్జీల బాదుడుతో ప్రయాణికులు లబో దిబో మంటున్నారు.
రాష్ట్రంలో ఏ పండగైనా సరే ఛార్జీలు పెంచాల్సిందే.. ప్రయాణికులను నిలువు దోపిడి చేయాల్సిందే అన్నట్లు ఆర్టీసి వ్యవహరిస్తోందని ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పండుగల సమయంలో ప్రజల రద్దీని క్యాష్ చేసుకోవాలని చూస్తోందని.. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు నిలువు దోపిడికి గురవుతున్నారంటూ ఆర్టీసిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పండగల సమయంలో ప్రజల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరికొన్ని బస్సులను నడపకుండా.. రోజు నడిచే బస్సులకే.. స్పెషల్ బస్సు అంటూ బోర్డు తగిలించి.. ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూల్ చేస్తున్నారంటూ.. దాంతోపాటు, ఒకే బస్సులో గొర్రెల మంద లాగా ఎక్కించి, వందల కిలోమీటర్లు నిలబడే ప్రయాణిస్తున్నామంటూ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండగల వేళ ఆర్టీసి, బస్సులను పెంచకుండా.. ఎక్కువ ఛార్జీలు వసూల్ చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.











