
నేడు లక్నోతో కీలక పోరు
లక్నో: ఐపిఎల్‌లో భాగంగా శనివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్‌కు చాలా కీలకంగా మారింది. ఆరంభంలో వరుస విజయాలతో ఈ సీజన్‌లో పెను ప్రకంపనలు సృష్టించిన పంజాబ్ ఆ తర్వాత పరాజయాల బాటపట్టింది. వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడి ప్లేఆఫ్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది. ఇక నాకౌట్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. ఇందులో ఓడితే ఇంటిదారి పట్టక తప్పదు. అంతేగాక చివరి లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓటమి పాలు కావాలి. కోల్‌కతా కూడా తన చివరి మ్యాచ్‌లో గెలవకూడదు. అప్పుడే పంజాబ్‌కు ప్లేఆఫ్ ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ కూడా ప్లేఆఫ్ రేసులో ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పంజాబ్ బలంగానే ఉంది. అయితే సమష్టిగా రాణించడంలో విఫలం కావడం జట్టుకు ప్రతికూలంగా తయారైంది.
ఆరంభంలో జట్టును ముందుండి నడిపించిన శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం పేలవమైన ఆటతో నిరాశ పరుస్తున్నాడు. బ్యాటింగ్‌లోనే కాకుండా కెప్టెన్‌గా కూడ పూర్తిగా తేలిపోతున్నాడు. దీని ప్రభావం జట్టుపై బాగానే పడుతోంది. కీలకమైన ఈ మ్యాచ్‌లోనైనా శ్రేయస్ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించక తప్పదు. జట్టులోని ఇతర ఆటగాళ్లు కూడా మెరుగైన ప్రదర్శన చేయాలి. అప్పుడే జట్టుకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. మరోవైపు లక్నో కూడా విజయమే లక్షంగా పెట్టుకుంది. ఇప్పటికే ప్లేఆఫ్‌కు దూరమైన లక్నో కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి కాస్తయిన ఊరట పొందాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో జట్టు చాలా బలంగా ఉంది. అయితే నిలకడైన ఆటను కనబరచడంలో విఫలమవుతోంది. ఈ మ్యాచ్‌లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఆడాలనే పట్టుదలతో ఉంది.











