పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు గడువు కంటే ముందుగానే జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంకేతాలిచ్చారు. 2027 ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉండగా, 2026 నవంబర్‌లోనే ఎన్నికలు జరగవచ్చని అన్నారు. బటిండాలో శనివారంనాడు జరిగిన రోడ్‌షోలో కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలు తక్షణం ఎన్నికల ప్రచారానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి మద్దతుగా నిలిచిన ఓటర్లకు కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. బర్నాలా, మోగా, బటాలా, బటిండా మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్లుగా ఆప్ కౌన్సిలర్లు ఎన్నికయ్యారని, పార్టీ పాలనపై ప్రజలకున్న నమ్మకాన్ని ఇది ప్రతిబింబిస్తోందని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ మాన్ కొనసాగుతారని, మరో సారి మాన్ సిఎం అయ్యేందుకు పార్టీ కార్యకర్తలందరూ కృషి చేయాలని కేజ్రీవాల్ కోరారు.