
రాష్ట్రంలోని యూని ఫాం సర్వీసుల ఉద్యోగాల నియామకాలకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలీస్, ఫైర్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పిఎఫ్), ఎక్సైజ్, రవాణా, అటవీ శాఖల్లో జరగనున్న ప్రత్యక్ష నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ రాష్ట్ర ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఈ ఉద్యోగాల గరిష్ఠ వయోపరిమితిని ఈ ఏడాది మే 18న జారీ చేసిన జీఒ నంబర్ 87 ద్వారా ఐదేళ్లు పెంచారు. తాజాగా దానికి అదనంగా మరో రెండేళ్ల సడలింపును ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రానున్న ప్రత్యక్ష నియామకాల్లో ఆ యా ప్రత్యేక, తాత్కాలిక నిబంధనల్లో నిర్దేశించిన గరిష్ఠ వయోపరిమితికి మొత్తం ఏడేళ్ల అదనపు సడలింపు వర్తించనుంది.










