కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిర్వహించిన ‘ఛలో పార్లమెంట్ ’ నిరసనపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడం, లాఠీ ఛార్జి చేయడం, పెల్లెట్ గన్‌లను పేల్చడం వంటి కఠిన చర్యలకు పాల్పడడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ సమావేశాల్లో ఈ వివాదం వాడివేడిగా సాగుతోంది. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఎందుకు ప్రయోగించారని విపక్షనేత రాహుల్ గాంధీ ప్రశ్నించడమే కాక, కేంద్రహోం మంత్రి అమిత్ షా ఆదేశాలతోనే ఇది జరిగిందని, అందుకే సభకు రావడానికి అమిత్ షాకు ధైర్యం చాలడం లేదని కూడా గట్టిగా నిలదీశారు. ఈ నేపథ్యంలో పోలీస్‌ల చర్య పౌరహక్కులు, శాంతి భద్రతల మధ్య ఉన్న సన్నని గీతను, పోలీస్ అధికారుల పరిమితులను మరోసారి చర్చకు తెచ్చింది. ఇది భావప్రకటన స్వేచ్ఛను అణగదొక్కడమేనన్న విమర్శలు వస్తున్నాయి. పోలీస్ మార్గదర్శకాల ప్రకారం గుంపును చెదరగొట్టడానికి ముందుగా హెచ్చరికలు, ఆ తరువాత జలఫిరంగులు, బాష్పవాయువు ప్రయోగం చేయాలి. అప్పటికీ గుంపు అదుపులోకి రాకుంటే లాఠీఛార్జి చేయాలి. శరీరాన్ని తీవ్రంగా గాయపరిచేలా ఉండరాదు.

పెల్లెట్ గన్స్ అత్యంత ప్రమాదకరమైనవి. ఆందోళనల వల్ల ప్రజలకు ప్రాణాపాయం తప్పదన్న పరిస్థితుల్లో మాత్రమే అది కూడా చివరి ప్రయత్నంగా పెల్లెట్ గన్స్‌ను ఉపయోగించాలి. భద్రత పేరుతో మితిమీరిన బలప్రయోగం చేయడం లేదా నిరసనలను అణచివేయడం ప్రజాస్వామ్య విలువలను దెబ్బ తీస్తుందని న్యాయస్థానాలు, ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలకు అసౌకర్యం కలిగించినంతమాత్రాన నిరసనలను హింసగా భావించకూడదన్న అభిప్రాయం ప్రజాస్వామ్యవాదుల్లో వినిపిస్తోంది. జులై 20న ఢిల్లీలో నిరసనలపై పోలీస్‌ల చర్యలు, అలాగే బీహార్ లోని సివాన్‌లో జులై 25న నీట్ పేపర్ లీక్ ఆందోళనల్లో ఒక కానిస్టేబుల్ ఎకె 47 అసాల్ట్ రైఫిల్‌తో గాలిలో కాల్పులు జరిపిన సంఘటన పైనా దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. అదే సమయంలో పోలీస్ అధికారుల కుటుంబాలు తమపై నిరసనకారులు దాడిచేసి, దౌర్జన్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై కూడా విచారించడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది.

క్రూరంగా దమనకాండకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారుల కుటుంబాల నుంచి వచ్చిన పిటిషన్లపై విచారణ జరపడం వల్ల విశ్వసనీయత దెబ్బతింటుందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఏదేమైనా తగిన అనుమతితో నిర్దేశిత ప్రదేశాల్లో నిరసనలు పాటించాలని ఆంక్షలు విధించడం నిరసనకారుల ప్రాథమిక హక్కుకు విరుద్ధమవుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించడం గమనార్హం. నిరసనల అసలు లక్షం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, అసౌకర్యానికి గురి చేయడమే. నిరసనలు పూర్తిగా క్రమబద్ధంగా, ముందుగానే ఊహించేలా ఉండాలని కోరుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కులపై పాలనా పరమైన ఆంక్షలను మోపడమే అవుతుంది. శాంతి భద్రతలను కాపాడవలసిన బాధ్యత రాష్ట్రంపై ఉన్నప్పటికీ కేవలం ఆందోళన జరుగుతుందనే కారణంతో పోలీస్ మితిమీరి బలప్రయోగం చేయడం సమర్థనీయం కాదు.

అదే సమయంలో ప్రతి అసౌకర్యం రాజ్యాంగం ద్వారా రక్షించబడదని గ్రహించాలి. ఆధునిక నగరాలు జనసాంద్రతతో నిండి ఉన్నాయి కాబట్టి శాంతియుతంగా ఎలాంటి నిరసనలు చేసినా, రాకపోకలను దిగ్బంధం చేసినా ఆందోళనలతో సంబంధం లేని వేలాదిమంది సాధారణ ప్రజలస్వేచ్ఛను హక్కులను కాలరాసే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే నిరసనల వల్ల ప్రజలకు జరిగే తాత్కాలిక అసౌకర్యం వేరు, ఇతరుల హక్కులకు భంగం కలిగించే హింసవేరు. ఈ రెండింటి మధ్య తేటతెల్లమైన వ్యత్యాసాన్ని న్యాయస్థానాలు గుర్తించాలి. ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించడానికి, తమ గొంతును వినిపించడానికి సాగే ప్రజాందోళనలతో కొంతవరకు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురుకావడం సహజం. ఇది ప్రజాస్వామ్యంలో నిరసనకు ఉండే రాజకీయ శక్తిలో భాగం. రాజ్యాంగం లోని ఏడవ షెడ్యూల్ ప్రకారం పోలీస్ వ్యవస్థ రాష్ట్ర జాబితాలోని అంశం కాబట్టి ప్రతి రాష్ట్రానికి తనదైన స్వతంత్ర విధానం ఉంటుంది.

రాష్ట్రాలు వేర్వేరుగా శిక్షణ కల్పించడం, పరికరాలు వినియోగించడం, స్థాయిని పెంచుకోవడం, రికార్డుల నిర్వహణ తదితర నియమాలను అనుసరిస్తుంటాయి. అయితే భారీ జనసమూహాలను అదుపు చేయడానికి లాఠీఛార్జి, బాష్పవాయు ప్రయోగం, జనాలను బెదిరించడానికి గాలిలో కాల్పులు జరపడం వంటి తీవ్రమైన చర్యలకు సంబంధించి ఏ పరిస్థితుల్లో, ఏ పరిమితుల్లో ఉపయోగించవచ్చునో అన్న విధానాలపై స్పష్టమైన అనుమతులు ఇచ్చేందుకు ఒక జాతీయ స్థాయి ప్రామాణిక విధానం అవసరం అన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. లాఠీచార్జీలను ఎందుకు చేయవలసి వచ్చిందో తప్పనిసరిగా రికార్డు చేయాలి.

బలప్రయోగం వినియోగించిన తరువాత గాయపడిన వారికి తక్షణం వైద్యసాయం అందజేయడం, ఆధారాలను భద్రపర్చడం, హింసాత్మక సంఘటనలు జరిగితే స్వతంత్రంగా విచారణ జరిపించడం ఇవన్నీ జాతీయ స్థాయి ప్రామాణిక విధానంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా దేశం లోని పోలీసుల్లో 70 శాతం పైగా అణచివేసే చర్యల్లో తమకు స్వేచ్ఛ కల్పించాలని కోరుకోవడం విశేషం. 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 8276 మంది పోలీస్ సిబ్బందిని స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా సర్వే చేయగా 70 శాతం మంది కన్నా ఎక్కువ మంది పోలీసులు తమ విధులను కచ్చితంగా నిర్వహించడంలో శిక్ష పడుతుందన్న భయం లేకుండా, కోర్టు ప్రమేయం లేకుండా స్వేచ్ఛగా తమకు బలప్రయోగం చేసే అవకాశం ఉండాలని కోరుకోవడం చర్చనీయాంశమవుతోంది.