పోలీసు చర్యపై రాజ్యసభలోనూ దుమారం

విద్యార్థులపై దాడి చేసిన వారు బహిరంగంగా తిరుగుతున్నారన్న ఖర్గే

పోలీసు చర్య కేవలం సాధారణ శాంతి భద్రతల సమస్యేనన్న జేపీ నడ్డా

ఎమర్జెన్సీ కాలాన్ని మరిచిపోయారా అంటూ నిలదీసిన మంత్రి

న్యూఢిల్లీ: సీజేపీ, విదార్థులు జూలై 20న జరిపిన ఛలో పార్లమెంటు మార్చ్‌పై పోలీసుల లాఠీచార్జి వివాదం రాజ్యసభలోనూ బుధవారం తీవ్ర దుమారం రేపింది. పోలీసుల దౌర్జనాన్ని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఖండించగా, పోలీసుల చర్య చట్టబద్ధమేనని కేంద్ర మంత్రి జేపీ నడ్డా సమర్ధించారు. దీంతో ఇటు అధికారపక్ష సభ్యులు, అటు విపక్ష ఎంపీల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగి సభలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి.

శాంతియుతంగా నిరసనలు చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి, బలప్రయోగం చేశారని, విద్యార్థులపై దాడి చేసిన వారు రోడ్లపై బహిరంగంగా తిరుగుతున్నారని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. నిరసనకారులపై పోలీసులు పెల్లెట్ గన్‌లు ప్రయోగించారంటూ వార్తలు వస్తున్నాయన్నారు. దీనిపై హోం మంత్రి అమిత్‌షా సభకు వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై లాఠీచార్జి జరిపిన పోలీసు అధిరులపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష సభ్యులు నినాదాలు హోరెత్తించారు.

ఎమర్జెన్సీని గుర్తుచేసిన నడ్డా

పోలీసు చర్య పేరుతో ప్రతిపక్షాలు అనవసర రాజకీయం చేస్తున్నారని కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈ సందర్భంగా స్పందించారు. పోలీసు చర్యను సమర్ధిస్తూ, ఇది సాధారణ శాతి భద్రతల సమస్య మాత్రమేనన్నారు. పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు చట్టబద్ధంగానే వ్యవహరించారని చెప్పారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. ఏ విద్యార్థి అయినా నిరసనల్లో పాల్గొన్నప్పుడు శాంతిభద్రతల సమస్యల సమస్యను ఎదుర్కోవలసి ఉంటుందని, శాంతి భద్రతల పరిరక్షణ కోసమే పోలీసులు తమ విధులను నిర్వర్తించారని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఎమర్జెన్సీ రోజులను నడ్డా గుర్తు చేస్తూ, తాను కూడా ఒకప్పుడు విద్యార్థినేనని, ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తనను తరగతి గదిలోనే పలుమార్లు అరెస్టు చేసిందని చెప్పారు.