మన తెలంగాణ/హైదరాబాద్: షాబాద్ ఘటనలో పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోలేదని, ఫోక్సో చట్టం అమలులో అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరుతూ ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. షాబాద్ కేసులో బాధితులను కాపాడటంలో పోలీసులు విఫలమయ్యారని, ఫోక్సో నిందితుడికి బెయిల్ ఇవ్వడం వైఫల్యమని పేర్కొన్నారు. ఫోక్సో కేసుల విచారణ కేవలం మాటలకే పరిమితం కాకుండా, ఒక నిర్దిష్ట కాలపరిమితిలోగా పూర్తికావాలని, తద్వారా బాధితులకు సత్వర న్యాయం అందాలని పవన్ అభిప్రాయపడ్డారు. నేరాలకు పాల్పడే నిందితులకు బెయిల్ రాకుండా ప్రభుత్వ యంత్రాంగం కోర్టుల్లో గట్టిగా వాదించాలని, వారికి కఠిన శిక్షలు చూడాలని పవన్ కోరారు. ముంబైలోని ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ బుధవారం డిశ్చార్జ్ అయి హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ నెల 11న శస్త్రచికిత్స చేయించుకుని ఆయన నాలుగు రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వైద్యుల సూచన మేరకు పవన్ కల్యాణ్ మూడు వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారు.