
మజ్లీస్ పార్టీ ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటోపై హిందుత్వ నినాదం రాసుకున్నందుకు మజ్లీస్ పార్టీ గుండాలు దౌర్జన్యం చేసి, ఆటో టాప్ చించేసి, బూతులు తిట్టారని ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అత్తాపూర్ పోలీసులు చర్యలు తీసుకోకుండా మజ్లిస్ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని ఆయన దుయ్యబట్టారు. హిందుత్వ నినాదం తొలగించకపోతే హైదరాబాద్‌లో ఆటో నడపనీయబోమని, కేసు పెట్టి బొక్కలో వేస్తామంటూ ఎస్‌ఐ దబాయించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. జరిగిన ఘటనను ఆటో డ్రైవర్ భరత్ హిందుత్వ వాదులను కలిస్తే, వారు తన వద్దకు తీసుకుని వచ్చారని ఆయన తెలిపారు. తమ పార్టీ అండగా ఉంటుందని భరత్‌కు హామీ ఇచ్చినట్లు ఆయన వివరించారు. డ్యామేజ్ అయిన ఆటో స్థానంలో కొత్త ఆటో కొనిస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ భరోసా ఇవ్వడంతో భరత్ ఆనందంతో కృతజ్ఞతలు తెలిపారు.













