దేశంలో ద్రవ్యోల్బణం మరోసారి సామాన్యుడి జీవితాన్ని కుదిపేస్తోంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఒ) విడుదల చేసిన తాజా వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) గణాంకాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక హెచ్చరికగా నిలిచాయి. రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుదల బాట పట్టడం ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నమోదైన అధిక ద్రవ్యోల్బణం ప్రజల జీవనవ్యయాన్ని మరింత భారంగా మార్చుతోంది. అయితే, ఈ పరిణామంలో అత్యంత ఆసక్తికరమైన, అదే సమయంలో ఆందోళన కలిగించే అంశం కేవలం ధరల పెరుగుదల కాదు.. ప్రజల స్పందనలో వచ్చిన మౌన మార్పు. ఒకప్పుడు ఉల్లిపాయ, టమాటా ధరలు పెరిగినా ప్రభుత్వాలు వణికిపోయేవి. రాస్తారోకోలు, ధర్నాలు, ఆందోళనలు, మార్కెట్ బంద్‌లు సాధారణ దృశ్యాలుగా కనిపించేవి. ధరల పెరుగుదల రాజకీయంగా కూడా పెద్ద చర్చకు దారితీసేది.

కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బంగారం రికార్డు స్థాయికి చేరినా, గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగినా ప్రజల్లో పెద్దగా నిరసన కనిపించడం లేదు. ఈ మౌనం అంగీకారమా? లేక అసహాయతా అనే ప్రశ్న ఇప్పుడు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణలో 6.36 శాతం ద్రవ్యోల్బణం నమోదు కావడం దేశంలోనే అత్యధికం కావడం యాదృచ్ఛికం కాదు. టమాటా ధరలు 53 శాతం, కొబ్బరికాయలు 40 శాతం, నిమ్మకాయలు 32 శాతం పెరగడం ప్రజల ఆహారపు బడ్జెట్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా పరిస్థితి భిన్నంగా లేదు. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అస్థిర వర్షపాతం, తుఫానులు, పంట నష్టాలు, పెరిగిన రవాణా వ్యయం, పౌల్ట్రీ దాణా ఖర్చులు కలిసి కోడిగుడ్లు, చికెన్, కూరగాయల ధరలను భారీగా పెంచాయి. ఒక కుటుంబం నెలవారీ ఖర్చులో ఆహార వ్యయం వాటా గణనీయంగా పెరగడం సహజంగానే ఇతర ఖర్చులపై ప్రభావం చూపుతోంది.

ఈ ధరల పెరుగుదలకు కారణాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఉద్యాన పంటలు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నప్పటికీ కూరగాయల సాగు విస్తీర్ణం పరిమితంగానే ఉంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి సరఫరాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఎక్కడైనా వర్షాలు, రవాణా అంతరాయం లేదా ఇంధన ధరల పెరుగుదల జరిగినా దాని ప్రభావం నేరుగా మార్కెట్ ధరలపై పడుతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సిపిఐ బేస్ ఇయర్‌ను మార్చడం, వినియోగ వస్తువుల జాబితాను విస్తరించడం వల్ల వినియోగ విధానంలో వచ్చిన కొత్త మార్పులు కూడా గణాంకాల్లో ప్రతిబింబిస్తున్నాయి. అయితే ద్రవ్యోల్బణం ప్రభావం కేవలం ఆర్థిక వ్యవస్థపైనే కాదు; సమాజం ఆలోచనా విధానంపైనా పడుతోంది. ఆర్థిక శాస్త్రంలో దీనిని ‘మార్కెట్ సైకాలజీ’గా పేర్కొంటారు. ధరలు పదేపదే పెరుగుతుండటంతో ప్రజలు నిరసన కంటే సర్దుకుపోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.

దీనికి శ్రింక్‌ఫ్లేషన్ ఒక స్పష్టమైన ఉదాహరణ. ప్యాకెట్ ధరను అలాగే ఉంచి అందులోని పరిమాణాన్ని తగ్గించడం ఇప్పుడు చాలా కంపెనీల వ్యూహంగా మారింది. వినియోగదారులు కూడా దాన్ని పెద్దగా ప్రశ్నించకుండా అంగీకరిస్తున్నారు. ఇది మార్కెట్‌కు అనుకూలమైనా, వినియోగదారుల హక్కుల పరంగా ప్రమాదకరమైన పరిణామం. ఇక కుటుంబాల ఖర్చు విధానంలోనూ గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. సినిమా, హోటల్ భోజనం, పర్యటనలు, వినోదం వంటి ఐచ్ఛిక ఖర్చులు తగ్గించి, కేవలం నిత్యావసరాలకే పరిమితమవుతున్నారు. మధ్యతరగతి కుటుంబాలు ధరలు పెరిగిన కూరగాయలను కొనకుండా వాటికి ప్రత్యామ్నాయాలు వెతకడం, తక్కువ ధర ఉన్న మార్కెట్లకు వెళ్లడం, అవసరాలను తగ్గించుకోవడం ఇప్పుడు సాధారణ జీవనశైలిగా మారుతోంది. ఇక్కడే మరో ఆసక్తికరమైన సామాజిక మార్పు కనిపిస్తోంది.

ఒకప్పుడు ప్రజా సమస్యలు వీధుల్లో పరిష్కారం కోసం పోరాడేవి. ఇప్పుడు అవే సమస్యలు సోషల్ మీడియా పోస్టులు, మీమ్స్, ట్రోల్స్ రూపంలో వ్యక్తమవుతున్నాయి. కోపం రోడ్డుపై కాకుండా మొబైల్ స్క్రీన్‌పైనే ఆగిపోతోంది. దీనిని మానసిక శాస్త్రవేత్తలు ‘ఎమోషనల్ వెంటింగ్’ గా అభివర్ణిస్తారు. అంటే సమస్యపై కోపాన్ని వ్యక్తం చేసిన అనుభూతి కలిగినా, వాస్తవ పరిస్థితిని మార్చే చర్య మాత్రం జరగదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల ఒత్తిడిని క్రమంగా బలహీనపరుస్తుంది. ఇప్పటి తరానికి ‘సామూహిక పోరాటం’ కంటే ‘వ్యక్తిగత సర్దుబాటు’ సులభమైన మార్గంగా కనిపిస్తోంది. టమాటా ధర పెరిగితే నిరసన చేపట్టడం కంటే టమాటా కొనకపోవడం, రైతుబజార్‌లో చవకగా వెతకడం లేదా ప్రత్యామ్నాయ వంటకాలను ఎంచుకోవడం వంటి నిర్ణయాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది వ్యక్తిగతంగా తెలివైన నిర్ణయం కావచ్చు.

కానీ సమాజం మొత్తం ఇలాంటి సర్దుబాట్లకే పరిమితమైతే, ధరల నియంత్రణపై ప్రభుత్వాలపై ఉండాల్సిన ప్రజా ఒత్తిడి సహజంగానే తగ్గిపోతుంది. ద్రవ్యోల్బణం అనేది కేవలం రిజర్వ్ బ్యాంక్ నియంత్రించాల్సిన ఆర్థిక సూచీ మాత్రమే కాదు. ఇది వ్యవసాయ విధానాలు, సరఫరా వ్యవస్థ, నిల్వ సదుపాయాలు, రవాణా ఖర్చులు, మార్కెట్ నియంత్రణ, వినియోగదారుల రక్షణ వంటి అనేక అంశాలతో ముడిపడి ఉంటుంది. కూరగాయల ఉత్పత్తి పెంచడం, కోల్ స్టోరేజ్ వ్యవస్థలను విస్తరించడం, రైతు నుంచి వినియోగదారుడికి నేరుగా సరఫరా అయ్యే వ్యవస్థలను బలోపేతం చేయడం, రవాణా వ్యయాన్ని తగ్గించే విధానాలు తీసుకురావడం వంటి చర్యలు అత్యవసరం.

అదే సమయంలో ప్రజల్లో వినియోగదారుల హక్కులపై అవగాహన కూడా పెరగాలి. శ్రింక్ ఫ్లేషన్ వంటి పద్ధతులను గుర్తించే సామర్థ్యం పెరగాలి. ధరల పెరుగుదలపై చర్చలు సోషల్ మీడియాకే పరిమితం కాకుండా విధానపరమైన మార్పులకు దారితీసే ప్రజాస్వామ్య చర్చలుగా మారాలి. ధరల పెరుగుదల ఆర్థిక సమస్య. కానీ దానిని సహజంగా అంగీకరించడం సామాజిక సమస్య. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను బాధ్యతాయుతంగా ఉంచేది ఎన్నికలు మాత్రమే కాదు; ప్రజల నిరంతర అప్రమత్తత కూడా. అందుకే నేటి పరిస్థితుల్లో అత్యంత ఆందోళన కలిగించేది ద్రవ్యోల్బణం పెరగడం కాదు.. దానికి ప్రజలు అలవాటుపడిపోవడమే. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం ప్రభుత్వాల బాధ్యత. కానీ ద్రవ్యోల్బణాన్ని సహజంగా స్వీకరించే మానసిక స్థితి నుంచి బయటపడటం సమాజం బాధ్యత. ధరలు పెరగడం కన్నా, ప్రశ్నించే స్వరం తగ్గిపోవడమే ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు.

- జి. శ్రీలత

63005 60191