
మన తెలంగాణ/ఆదిలాబాద్ ప్రతినిధి: పశువులకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి, కార్లలో అపహరించి మహారాష్ట్రలోని వధశాలలకు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ఘరానా దొంగల ముఠాను ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ సమావేశ మందిరంలో ఆదివారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కేసు వివరాలను వెల్లడించారు. గత ఒకటిన్నర సంవత్సరంగా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఈ ముఠా పశువుల దొంగతనాలకు పాల్పడుతోందని ఎస్పీ తెలిపారు.
ఈ ముఠా సభ్యులు రాత్రి వేళల్లో ఎస్‌యూవీ, ఇన్నోవా వాహనాల వెనుక సీట్లను తొలగించి, పశువులకు బలవంతంగా మత్తు మందులు ఇచ్చి వాహనాలలో ఎక్కించి మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతంలోని వధశాలలకు తరలించేవారని విచారణలో తేలింది. అక్కడ అక్రమంగా మాంసం విక్రయిస్తూ భారీగా లాభాలు పొందుతున్నారు. ఈ ముఠాలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. వీరు పోలీసుల కంట పడకుండా తమ వాహనాలకు నకిలీ నంబర్ ప్లేట్లు అమర్చుకుని, టోల్ ప్లాజాలు, చెక్‌పోస్టులు లేని మార్గాలను ఎంచుకుని పశువులను తరలిస్తున్నారు. ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులపై ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయగా, ఐదుగురిని అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
అరెస్ట్ అయిన వారిలో మొహమ్మద్ షాహిద్ ఖాద్రి, ఆలం శేఖ్ అనీష్, ఫార్మన్ సాబీర్ శేఖ్, షేక్ తాబాస్ షకీల్, వసీమ్ ఖురేషి ఉన్నారు. నిందితుల వద్ద నుండి ఒక కారు, సెల్‌ఫోన్లు, నకిలీ నంబర్ ప్లేట్లు స్వాధీనం చేసుకున్నారు. గత ఒకటిన్నర సంవత్సర కాలంలో ఈ ముఠా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏడు పశువుల దొంగతనాలకు పాల్పడింది. ఇందులో తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కేసులు, తాంసి పరిధిలో 1 కేసు, జైనథ్ పరిధిలో 1 కేసు, ఆదిలాబాద్ వన్‌టౌన్ పరిధిలో 1 కేసు, ఆదిలాబాద్ టూ టౌన్ పరిధిలో 1 కేసు నమోదయ్యాయి. అదేవిధంగా నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాలలో కూడా ఈ ముఠాపై కేసులు నమోదై ఉన్నాయి.
పశువుల దొంగతనాలపై అందిన ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజీలు, వాహనాల కదలికలు, నిందితుల కాల్ డేటాను విశ్లేషించడం ద్వారా కేసును ఛేదించారు. ప్రజలు తమ పశువులను రాత్రి వేళల్లో సురక్షిత ప్రదేశాలలో కట్టివేయాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-100కు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. ఈ కేసును ఛేదించిన పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.












